WTC Final 2023: ఓటమికి బీజం పడిందక్కడే - టీమిండియా పరాభవానికి కారణాలివే?
వరుసగా రెండోసారి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈ ఏడాది కూడా ‘గద’ను దక్కించుకోలేకపోయింది.
WTC Final 2023: రెండేండ్ల కష్టం. టెస్టు హోదా ఉన్న దేశాలన్నీ రెండు సంవత్సరాల పాటు నానా తిప్పలు పడితే టాప్-2లో ఉన్న జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరే అవకాశం. ఈ అవకాశం ఒక్కసారి రావడమే గొప్ప అనుకుంటే నాలుగేండ్లలో టీమిండియాకు వరుసగా రెండుసార్లు దక్కింది. అయినా ఏం లాభం..? ఐసీసీ టోర్నీలలో వైఫల్యాల పరంపర టీమిండియాను వెంటాడింది. భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి కారణాలేంటి..?
బీజం పడిందక్కడే..
కెన్నింగ్టన్ ఓవల్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువని గణాంకాలు మొత్తుకుంటున్నా రోహిత్ శర్మ మాత్రం బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఓటమికి బీజం పడిందే ఇక్కడ. టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఓ ట్వీట్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ‘టీమిండియా టాస్ గెలిచి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించింది’ అని అతడు ట్వీట్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇక్కడ ఇప్పటివరకూ 104 మ్యాచ్‌లు జరుగుగా టాస్ గెలిచిన జట్టు 88 సార్లు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో ఏకంగా 38 సార్లు మొదలు బ్యాటింగ్ చేసిన టీమే విజయాలు సాధించింది.
అశ్విన్‌ను పక్కనబెట్టి..
ఓవల్ పిచ్ పేసర్లకు అనుకూలమైనప్పటికీ చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లకు వికెట్లు తీసే అవకాశం ఉందని గత రికార్డులతో పాటు విశ్లేషకులూ నెత్తీ నోరు మొత్తుకున్నారు. కానీ రోహిత్ మాత్రం.. అశ్విన్‌ను పక్కనబెట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జడేజా, నాథన్ లియాన్ లు ఒక్కొక్క వికెటే తీసినా రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ మూడు వికెట్లు తీయగా లియాన్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. మరి టీమిండియాలో అశ్విన్ ఉండి ఉంటే.. కథ వేరే ఉండేది. అదీగాక ఆసీస్ బ్యాటింగ్ లైనప్ లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లే. వీరికి అశ్విన్ కచ్చితంగా ఇబ్బందిపెట్టి ఉండేవాడు. అశ్విన్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు కొరకరాని కొయ్య అయ్యాడు.
పేసర్లు దారుణం..
సాధారణంగానే ఓవల్ బౌన్సీ పిచ్. ఇది పేసర్లకు అనుకూలం. దీంతో భారత్ నలుగురు పేసర్లను తీసుకుంది. అశ్విన్ స్థానంలో రోహిత్.. నాలుగో పేసర్‌గా ఉమేశ్ యాదవ్ ను తీసుకున్నాడు. షమీ, సిరాజ్, ఉమేశ్, శార్దూల్.. నలుగురు పేసర్లున్నా భారత జట్టు ఆసీస్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టలేకపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందే ఈ నలుగురూ ఐపీఎల్ - 16 ఆడారు. ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో షమీ (28) ముందుండగా సిరాజ్ (19) కూడా జోరుమీదే ఉన్నాడు. కానీ అసలు సమరంలో ఈ ఇద్దరూ ఆశించిన మేర రాణించలేదు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి షమీ మూడు వికెట్లు తీస్తే సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఇద్దరూ ధారాళంగా పరుగులిచ్చారు. ఆసీస్ బ్యాటర్లు షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నా అవి వేయడంలో విఫలమయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్.. షార్ట్ పిచ్ బాల్స్ ఆడేందుకు ఇబ్బందిపడ్డా టీమిండియా అతడి బలహీనతను పసిగట్టలేకపోయింది.
One key stand 🏏
— ICC (@ICC) June 11, 2023
Missed opportunities 😞
Inspired deliveries 🚀
Selection gambles 👀
These were the defining moments of a fantastic #WTC23 Final ⬇️https://t.co/yCEyHZlESr
ఆసీస్ బ్యాటర్లపై నోటికి పని చెప్పి దూకుడుగా కనిపించిన సిరాజ్.. ఆ దూకుడును వికెట్లు తీయడంలో చూపించలేదు. వీరికి తోడు అశ్విన్ స్థానంలో తీసుకున్న ఉమేశ్.. ఏమాత్రం ప్రభావం చూపలేదు. గుడ్డిలో మెల్లలా శార్దూల్.. కాస్త బెటర్. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా టీమిండియాకు ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. టీమిండియా బౌలర్లు వికెట్ కోసం ఎదురుచూపులు చూస్తే ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత్‌ను రెండుసార్లు అలవకోగా ఆలౌట్ చేయడం గమనార్హం.
టాపార్డర్ బొక్క బోర్లా..
భారత్ మ్యాచ్ ఓడటానికి పైన పేర్కొన్న కారణాల కంటే ఇది అత్యంత ప్రధానం. ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఛేదనలో మొనగాడు (కోహ్లీ) ఛేదించలేదు. ప్రిన్స్ (శుభ్‌మన్ గిల్) ఆటలో పసలేదు. హిట్‌మ్యాన్ (రోహిత్ శర్మ) మెరుపులు మెరిపించలేదు. నయా వాల్ (పుజారా) నిట్టనిలువునా కూలిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన పిచ్‌పై ఈ నలుగురూ చేసిన రన్స్ 58. 18 నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చిన రహానే (89) ఆదుకోబట్టి సరిపోయింది గానీ లేకుంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రహానేకు తోడుగా శార్దూల్ (51), జడేజా (48) ఫర్వాలేదనిపించారు.
పోనీ రెండో ఇన్నింగ్స్ లో అయినా ఆడతారునుకుంటే ఇక్కడా అదే నిర్లక్ష్య ధోరణి. గిల్ (18) వివాదాస్పద రీతిలో నిష్క్రమించినా.. రోహిత్ (43) మంచి టచ్ లోనే కనిపించినా చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. పుజారా (27) గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కోహ్లీ (49) నాలుగో రోజు ఆశలు కల్పించినా ఐదో రోజు తొలి సెషన్ లో అలా వచ్చి ఇలా వెళ్లాడు. మిచెల్ స్టార్క్, అలెక్స్ కేరీ వంటి వాళ్లు మెరుగ్గా ఆడిన పిచ్‌పై మన ప్రపంచ స్థాయి వీరులు విఫలమవడం గమనార్హం.