IND vs AUS, 4th Test: ఎట్టకేలకు ఆసీస్ ఆలౌట్ - తొలి ఇన్నింగ్స్ స్కోరు 480
IND vs AUS, 4th Test: హమ్మయ్య! ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఆలౌటైంది! తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 480 పరుగులు చేసింది.
IND vs AUS, 4th Test:
హమ్మయ్య! ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఆలౌటైంది! తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 480 పరుగులు చేసింది. ఇందుకోసం 167.2 ఓవర్లు ఆడింది. ఉస్మాన్ ఖవాజా (180; 422 బంతుల్లో 21x4) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కామెరాన్ గ్రీన్ (114; 170 బంతుల్లో 18x4) అద్భుత శతకం బాదేశాడు. ఆఖర్లో నేథన్ లైయన్ (34; 96 బంతుల్లో 6x4), టాడ్ మర్ఫీ (41; 61 బంతుల్లో 5x4) సైతం కీలక ఇన్నింగ్సులు ఆడేశారు. ఆఖరి సెషన్లో ఖవాజాను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిగిలిన రెండు వికెట్లూ రవి చంద్రన్ అశ్విన్ (6/91) ఖాతాలో చేరాయి.
తొలి సెషన్లో ఖవాజా గ్రీన్ అటాక్
ఓపిక పడితే ఇండియన్ పిచ్‌లపై భారీ స్కోర్లు చేయొచ్చని ఉస్మాన్ ఖవాజా (ఓవర్‌నైట్ స్కోరు 104) నిరూపించాడు. అతడికి కామెరాన్ గ్రీన్ (49) సరైన భాగస్వామిగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా నిలకడగా పరుగులు చేస్తున్నారు. దాంతో ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట మొదలెట్టిన ఆస్ట్రేలియా ఇప్పుడు టీమ్‌ఇండియాకు చుక్కలు చూపిస్తోంది. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే గ్రీన్ ఒక పరుగు పూర్తి చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే చూడచక్కని షాట్లు బాదేశారు. దాంతో డ్రింక్స్ బ్రేక్‌కు ఆసీస్ 296/4తో నిలిచింది. ఆ తర్వాత ఖావాజా మరింత దూకుడుగా ఆడాడు. అతడు 346 బంతుల్లో 150 మైలురాయిని చేరుకోవడంతో ఆసీస్ 347/4తో లంచ్‌కు వెళ్లింది.
రెండో సెషన్లో అశ్విన్ రంగ ప్రవేశం
రెండో సెషన్లో రవిచంద్రన్ అశ్విన్ విజృంభించాడు. తనదైన వైవిధ్యంతో బంతులు విసిరాడు. మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ దూకుడు కళ్లెం వేశాడు. లంచ్ తర్వాత కామెరాన్ గ్రీన్ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అయితే జట్టు స్కోరు 378 వద్ద అతడిని యాష్ ఔట్ చేశాడు. అతడు వేసిన 130.2వ బంతిని స్వీప్ చేసేందుకు గ్రీన్ ప్రయత్నించాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. దాంతో ఐదో వికెట్‌కు వారు నెలకొల్పిన 208 (358 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరపడింది. మరో నాలుగు బంతులకే అలెక్స్ కేరీ (0)నీ యాష్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ (6) సహకారంతో ఖవాజా ఇన్నింగ్స్ నడిపించాడు. పెరుగుతున్న ఈ భాగస్వామ్యాన్నీ స్టార్క్‌ను ఔట్ చేయడం ద్వారా యాష్ విడదీశాడు. 7 వికెట్ల నష్టానికి 409 పరుగులతో ఆసీస్ తేనీటి విరామం తీసుకుంది.
మూడో సెషన్లో ఖవాజా ఔట్
ఆఖరి సెషన్ ఆరంభంలోనే టీమ్‌ఇండియాకు బ్రేక్‌త్రూ లభించింది. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న వికెట్ దొరికింది. ద్విశతకానికి 20 పరుగుల దూరంలో ఉస్మాన్ ఖవాజా ఔటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 146.1వ బంతిని ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇకనైనా కంగారూలు త్వరగా ఆలౌటవుతారని అభిమానులు భావించారు. అయితే టెయిలెండర్లు నేథన్ లైయన్, టాడ్ మర్ఫీ ఓ పట్టాన వదల్లేదు. తొమ్మిదో వికెట్‌కు 117 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరిని అశ్విన్ ఒక పరుగు వ్యవధిలో బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 479 వద్ద మర్ఫీ, 480 వద్ద లైయన్‌ను పెవిలియన్ పంపించాడు.