Team India Schedule: నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే! - వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై కపిల్ దేవ్ ఆగ్రహం
అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో భారత క్రికెట్ జట్టు షెడ్యూల్‌పై దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Team India Schedule: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు రెండో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు బీసీసీఐపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే మూడు నెలలలో వన్డే ప్రపంచకప్ ఉండగా జట్టు కూర్పుపై దృష్టి సారించాల్సింది పోయి ప్రయోగాల పేరిట కాలయాపన చేస్తున్నారని కోచ్ ద్రావిడ్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ పైనా విమర్శలు వస్తున్నాయి. విండీస్‌పై రెండో వన్డేలో ఓటమితో పాటు వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు బిజీ షెడ్యూల్‌పై టీమిండియా దిగ్గజ సారథి, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా రూపొందించిన షెడ్యూల్‌లో భారత జట్టు 9 నగరాలలో (ఒకవేళ సెమీస్, ఫైనల్స్‌కు క్వాలిఫై అయితే ఆ సంఖ్య 11కు చేరుతుంది) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇదే విషయమై తాజాగా కపిల్ దేవ్ ‘ది వీక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వన్డే వరల్డ్ కప్‌లో భారత షెడ్యూల్‌ను ఎవరు రూపొందించారో నాకైతే తెలియదు. ధర్మశాల, బెంగళూరు, కోల్‌కతా.. ఇలా 9 వేర్వేరు ప్రదేశాలలో ఆడాల్సి ఉంది...
నన్ను ఎవరో అడిగారు.. మీరే బీసీసీఐ అధ్యక్షుడైతే ఏం చేసేవాళ్లు..? అని నేనే గనక బీసీసీఐ అధ్యక్షుడినైతే నా టీమ్‌కు నేను ఒక చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసేవాడిని. వాళ్ల నుంచి మంచి ప్రదర్శనను రాబట్టేందుకు కృషి చేసేవాడిని. ఒక బోర్డు చేయాల్సిన పనులు ఇవి..’అని అన్నాడు.
కాగా వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంచి ఆ తర్వాత 11న ఢిల్లీలో అఫ్గానిస్తాన్, 15న పాకిస్తాన్‌తో అహ్మదాబాద్‌లో, 22న పూణెలో బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత మూడు రోజులకే 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో ఆడాల్సి ఉంది. ఆడేది 9 మ్యాచ్‌లే అయినా భారత జట్టుకు ప్రయాణ బడలిక తప్పేలా లేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కపిల్ దేవ్ పై విధంగా స్పందించాడు.
🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇
— BCCI (@BCCI) June 27, 2023
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
రెండు రోజుల క్రితమే కపిల్ దేవ్.. ఆటగాళ్ల పనిభారం నిర్వహణలో బీసీసీఐ దారుణంగా విఫలమవుతోందని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గాయాలైనా ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాధాన్యతనిస్తున్నా ఆటగాళ్లు జాతీయ జట్టు అనేసరికి ఆ సాకుతో ఇక్కడ తప్పించుకుంటున్నారని, ఒకవేళ ఆడినా గాయం పేరు చెప్పి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ దగ్గర కూడా మూడు నుంచి ఐదేళ్ల వరకూ క్రికెట్ క్యాలెండర్‌పై అవగాహన లేదని, బోర్డులో ఏదో తప్పు కనిపిస్తోందని తెలిపాడు. ఇక భారత క్రికెటర్లు అన్నీ తమకే తెలుసని తెగ ఫీల్ అవుతారని, ఎవరైనా సలహాలు ఇచ్చినా తీసుకునే స్టేజ్‌లో వాళ్లు లేరని విమర్శలు గుప్పించాడు.
'టీమ్‌ఇండియా క్రికెటర్లు తమకే అన్నీ తెలుసని ఫీలవుతారు. ఎవరి సలహాలూ తీసుకోరు. ఒక్కసారిగా డబ్బులొస్తే ఇలాంటి అహంకారమే వస్తుంది. ఇప్పుడు క్రికెటర్లకు సీనియర్ల గైడెన్స్ అవసరం. దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ నుంచి సలహాలు తీసుకోవడానికి ఇబ్బందేంటో నాకైతే అర్థమవ్వడం లేదు' అని కపిల్ దేవ్ అన్నాడు. అడిగేంత వరకూ ఎవరూ సూచనలు ఇవ్వరని.. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ తర్వాత తనను ఎవరూ సలహాలు అడగడం లేదని కపిల్ తెలిపాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial