ICC World Cup 2023: రోహిత్ నిరాశపరుస్తున్నాడు - టీమ్‌లో అది మిస్ అయింది - గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా సారథి రోహిత్ శర్మ నాయకత్వంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హిట్‌మ్యాన్ నుంచి తాను చాలా ఆశించానని, కానీ అతడు ఆ మేరకు విజయవంతం కాలేదని వాపోయాడు.
ICC World Cup 2023: విరాట్ కోహ్లీ టీ20 సారథ్య పగ్గాలను వదిలేసిన తర్వాత వాటిని చేపట్టిన రోహిత్.. ఆనతికాలంలోనే టీమిండియాకు పూర్తి స్థాయి సారథిగా మారాడు. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టుకు ఎదురులేకపోయినా ఐసీసీ టోర్నీలలో మాత్రం టీమిండియా దారుణ వైఫల్యాలను మూటగట్టకుంది. దీనికి తోడు టీమ్‌లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ‘టీమ్‌లో గతంలో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్లు.. ఇప్పుడు జస్ట్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు’అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పై అంశాలపై తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌లో ఆటగాళ్ల మధ్య బాండింగ్ మిస్ అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
టీమ్ బాండింగ్‌పై..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘టీమిండియాలో ప్లేయర్ల మధ్య బాండింగ్ మిస్ అవడం బాధాకరం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు ఒక దగ్గరకు చేరి వారికి ఇష్టమున్న విషయాల పట్ల మాట్లాడుకోవాలి. అది సినిమాలు కావొచ్చు.. సంగీతం, ఇంకేదైనా సరే.. వారి ఆసక్తులను బట్టి చర్చలు చేయాలి. ఒకవేళ అది జరుగకుంటే టీమ్‌లో ఆటగాళ్ల మధ్య బంధం ఎలా ఏర్పడుతుంది..? గతంలో అందరికీ కలిపి ఒకే రూమ్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆటగాళ్లకు హోటల్ రూమ్స్‌లో ఒక్కొక్కరికి ఒక్కో గది ఇస్తున్నారు. ఇది కూడా క్రికెటర్ల మధ్య దూరం పెరగడానికి ఒక కారణం..’అని తెలిపాడు. అశ్విన్ వ్యాఖ్యలను సమర్థింపుగానే ఈ వ్యాఖ్యలున్నాయి.
రోహిత్ కెప్టెన్సీపై..
‘రోహిత్ శర్మ టీమిండియా పగ్గాలు చేపట్టాక నేను అతడి నుంచి అతిగా ఆశించాను. స్వదేశంలో మ్యాచ్‌లు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ విదేశాలు పూర్తికి విరుద్ధం. అక్కడి పరిస్థితులను తట్టుకుని సత్తా చూపించాలి. ఈ విషయంలో రోహిత్ నన్ను చాలా నిరాశపరిచాడు. మిగతా ఫార్మాట్ల సంగతి పక్కనబెడితే టీ20లలో కూడా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. ఐపీఎల్‌లో వందలాది మ్యాచ్‌లు ఆడి, తన టీమ్‌ను విజయవంతంగా నిలిపిన అనుభవం, బెస్ట్ ఐపీఎల్ ప్లేయర్స్‌ను పెట్టుకుని కూడా టీ20 ప్రపంచకప్‌లో అతడు కనీసం జట్టును ఫైనల్‌కు కూడా చేర్చలేకపోయాడు. అది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది’అని చెప్పాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమిపై..
‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమిపై బీసీసీఐ.. రోహిత్, ద్రావిడ్‌లను ప్రశ్నించాల్సింది. టాస్ గెలిచాక ఓవల్‌లో బ్యాటింగ్ తీసుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నట్టు..? ట్రావిస్ హెడ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడతాడని తెలిసినా ఎందుకు ఆ దిశగా ప్రయత్నించలేదు? హెడ్ క్రీజులోకి వచ్చినప్పుడు కామెంటరీ బాక్స్‌లో ఉన్న పాంటింగ్.. అతడికి బౌన్సర్లు వేయండి బౌన్సర్లు వేయండి అని చెబుతూనే ఉన్నాడు. హెడ్ వీక్‌నెస్ తెలిసి కూడా అతడిని ఎందుకు కట్టడి చేయలేదు..? వంటి విషయాలపై బీసీసీఐకి వాళ్లిద్దరూ సమాధానం చెప్పాలి’అని సన్నీ తెలిపాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial