ICC ODI Rankings 2023: పాక్‌కు గండికొడుతున్న కోహ్లీ, రోహిత్, గిల్ - నాలుగేళ్ల తర్వాత ఈ రికార్డు!
ICC ODI Rankings 2023: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పాకిస్థాన్ ఆధిపత్యానికి గండి కొడుతున్నారు.
ICC ODI Rankings 2023:
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పాకిస్థాన్ ఆధిపత్యానికి గండి కొడుతున్నారు. వన్డే ఫార్మాట్లో టాప్-10 బ్యాటర్లలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తమ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు.
ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా విజృంభిస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు అదరగొడుతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ శుభ్‌మన్ గిల్ ఏకంగా కెరీర్ అత్యుత్తమ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతడు అగ్రస్థానంలోని బాబర్ ఆజామ్‌కు సవాల్ విసురుతున్నాడు. ఆసియాకప్‌లో 154 పరుగులు చేసిన అతడు 759 రేటింగ్ పాయింట్లు సాధించాడు. బాబర్ (863)తో పోలిస్తే 103 పాయింట్లే తక్కువ.
విరాట్ కోహ్లీ రెండు స్థానాలను మెరుగుపర్చుకున్నాడు. ఎనిమిదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ సైతం రెండు ర్యాంకులు పెరిగి తొమ్మిదో స్థానానికి వచ్చాడు. దాంతో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారతీయులు టాప్-10లో చోటు దక్కించుకున్నట్టు అయింది. చివరిసారిగా 2019 ఆరంభంలో శిఖర్ ధావన్, రోహిత్, విరాట్ టాప్-10లో ఉండేవారు. ఆసియాకప్‌లో పాక్‌పై కింగ్ కోహ్లీ అమేజింగ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక హిట్‌మ్యాన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదేశాడు.
వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటికీ ముగ్గురు పాకిస్థానీ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉండగా ఫకర్ జమాన్ మూడు స్థానాలు చేజార్చుకొని పదో ప్లేస్‌లో ఉన్నాడు. ఇమామ్ ఉల్ హఖ్ ఒక ప్లేస్ తగ్గి ఐదుకు చేరాడు.
టీమ్‌ఇండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తన ర్యాంకును బాగా మెరుగుపర్చుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకు సాధించాడు. ఆసియాకప్‌లో అతడు తొమ్మిది వికెట్లు తీయడం ప్రత్యేకం. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ల జాబితతాలో ఆరు నుంచి నాలుగో స్థానానికి వచ్చాడు. ఇక పాకిస్థాన్‌లో హ్యారిస్ రౌఫ్ 8 స్థానాలు ఎగబాకి 21, నసీమ్ షా 11 స్థానాలు మెరుగై 51కి చేరుకున్నారు.
దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచులో మూడు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఒక ర్యాంకు మెరుగై నాలుగుకు పరిమితం అయ్యాడు.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ : బాబర్ ఆజామ్, శుభ్‌మన్ గిల్, రసివాన్‌డర్ డుసెన్, డేవిడ్ వార్నర్, ఇమామ్ ఉల్ హఖ్, హ్యారీ టెక్టార్, క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, ఫకర్ జమాన్
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ : జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, మ్యాట్ హెన్రీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కుల్‌దీప్ యాదవ్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, షాహీన్ అఫ్రిది
రోహిత్ @ 10 వేలు
- వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రెండో క్రికెటర్ రోహిత్. ఈ ఘనతను అందుకోవడానికి హిట్‌మ్యాన్‌కు 241 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి. అంతకుముందు విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌లలోనే పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్, గంగూలీ 263 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు. భారత క్రికెట్ జట్టులో సచిన్ (18,426), విరాట్ (13,027), గంగూలీ (11,363), ద్రావిడ్ (10,889), ఎంఎస్ ధోని (10,773) తర్వాత స్థానం రోహిత్ (10,031)దే..