T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్, ట్రోఫీ యాత్ర స్టార్ట్ చేసిన గేల్
T20 World Cup Trophy Tour 2024 : అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర న్యూయార్క్‌లో మొదలైంది.
ICC Mens T20 World Cup Trophy Tour 2024 launched in New York: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర న్యూయార్క్‌లో మొదలైంది.
యాత్ర షురూ....
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర ప్రారంభమైంది. విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్, రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన క్రిస్ గేల్, అమెరికా బౌలర్ అలీ ఖాన్ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి ట్రోఫీ యాత్రను ఆరంభించారు. ట్రోఫీ యాత్ర 15 దేశాల్లో సాగుతుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది.
ఐసీసీ రిజర్వ్ డేలు
ఆ మూడు మ్యాచ్‌లకు..
టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్ మ్యాచ్‌లూ జూన్ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
చకచకా ఏర్పాట్లు
వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన లోగోలను ఐసీసీ విడుదల చేసింది. పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్ లోగోలను విడుదల చేసింది. లోగోలపై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయర్ల ఎనర్జీని సూచించే సంకేతం ఉంది. మొత్తంగా ఈ లోగోలు టీ20 క్రికెట్‌ను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త లోగోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.