ODI Cricketer of Year 2023: ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటాపోటీ, నలుగురిలో ముగ్గురు భారత క్రికెటర్లే
ODI Cricketer of Year 2023: వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డులకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారతీయులే.
Cricket News: వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు(ICC Men ODI Cricketer Of The Year 2023)లకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ(ICC) ప్రకటించింది. ఈ అవార్డు కోసం నలుగురు స్టార్ ఆటగాళ్లు పోటీ పడుతుండగా.. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ(Virat Kohli), మహ్మద్ షమీ(Mohammed Shami)లతోపాటు 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. న్యూజిలాండ్ (New Zealand)ప్లేయర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) కూడా ఈ అవార్డు రేసులో నిలిచారు. ఆసియాకప్(Asia Cup)తో పాటు వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. మెగాటోర్నీలో 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ ఏడాది 27 మ్యాచులు ఆడిన కోహ్లీ 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో షమీ 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది 19 మ్యాచులు ఆడిన షమీ 43 వికెట్లు పడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది 29 మ్యాచుల్లో 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ విషయానికి వస్తే.. అతడు 26 మ్యాచుల్లో 1204 పరుగులు చేశాడు.
సూర్య, జైస్వాల్ కూడా...
ఐసీసీ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023, మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు(Men's Emerging Player Of The Year Award)లకు స్టార్ ఆటగాళ్లు నామినేట్ అవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఈ రెండు అవార్డులకు ఇద్దరు భారత ఆటగాళ్లు పోటీ పడుతుండడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత కలిగిస్తోంది. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal) ఉన్నారు. ప్రతిష్ఠాత్మక టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023 కోసం టీ 20లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్... జింబాబ్వే(Zimbabwe) సారథి సికిందర్ రజా(Sikander Raza), న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్క్ చాప్‌మన్(Mark Chapman), ఉగాండా (Uganda) సంచలనం అల్పేష్ రమ్జానీ(Alpesh Ramzani) పోటీ పడుతున్నారు.
అందరూ గట్టి పోటీదారులే
సూర్యకుమార్ యాదవ్ 2023లో పరుగుల వరద పారించాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్ 155.95 స్ట్రైక్ రేటుతో 733 రన్స్ కొట్టాడు. జింబాబ్వే టీ20 సారథిగా పగ్గాలు చేపట్టిన సికిందర్ రజా 11 ఇన్నింగ్స్‌ల్లో 155 పరుగులు చేయడమే కాకుండా బంతితోనూ రాణించి 17 వికెట్లు కూల్చాడు. ఉంగాండా బౌలర్ అల్పేష్ రమ్జానీ 30 మ్యాచుల్లో 4.77 ఎకానమీతో 55 వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్ చాప్‌మన్ 2023లో అద్భుతంగా ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 17 ఇన్నింగ్స్‌ల్లో 145.54 స్ట్రైక్ రేటుతో 556 రన్స్ కొట్టాడు. మహిళల విభాగంలో టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023 అవార్డు కోసం ఆస్ట్రేలియా యంగ్‌స్టర్ ఫొబె లిచ్‌ఫీల్డ్, బంగ్లాదేశ్ క్రికెటర్ మరుఫా అక్తర్, ఇంగ్లండ్ ప్లేయర్ లారెన్ బెల్, స్కాంట్లాండ్ అమ్మాయి డార్సే కార్టర్ పోటీ పడుతున్నారు.
జైస్వాల్ సాధిస్తాడా...
మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. యశస్వి జైస్వాల్ 4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు చేసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. 2023లో రచిన్ రవీంద్ర 10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. గెరాల్డ్ కొయెట్జీ 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయగా.. దిల్షన్ మధుషంక 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు.