ICC 2 Tier Test System: టెస్టుల్లో ఐసీసీ విప్లవాత్మక మార్పులకు ప్రయత్నాలు.. టూ టైర్ సిస్టమ్ తో డబ్ల్యూటీసీకి మంగళం !
సమ ఉజ్జీల మధ్య పోరు జరిగితే మజా వస్తుందని ఐసీసీ భావిస్తున్నట్లుంది. అందుకే జట్లను వీడిదీసి, పెద్ద, చిన్న జట్లుగా గ్రూపులుగా ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించాలని చూస్తోంది.
ICC Cricket News: టెస్టు క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఐసీసీ ట్రై చేస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డుల సారథులతో ఐసీసీ ఈ మేరకు చర్చించేందుకు రెడీ అవుతోంది. టెస్టుల్లో టూ టయర్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని ఐసీసీ ఐడియాగా తెలుస్తోంది. భారత్, ఆసీస్, ఇంగ్లాండ్ జట్లతోనే ఒక గ్రూపును ఇతర జట్లతో మరో గ్రూపును ఏర్పాటు చేయాలని ఐసీసీ భావిస్తోంది. దీంతో పెద్ద జట్ల మధ్య ఎక్కువగా మ్యాచ్ లు జరిగేలా చూడాలని ఐడియాగా ఉన్నట్లు తెలుస్తోంది. సమఉజ్జీల మధ్య పోటీ జరిగితే కిక్కునిస్తుందని, టెస్టు క్రికెట్ మరింత మజాగా తయారవుతోందని బోర్డు భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గతంలో అంటే 2016లోనే ఈ రకంగా టూ టయర్ టెస్టు సిస్టమ్ ప్రవేశ పెట్టాలని ఐసీసీ భావించగా అప్పుడు కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఐసీసీ చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన భారత మాజీ కార్యదర్శి జై షా ఇందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారు.
2016లో బీసీసీఐనే మోకలడ్డింది.
నిజానికి ఎనిమిదేళ్ల కిందట ఐసీసీ ఇలాంటి ఆలోచన తీసుకురాగా, అప్పుడు బీసీసీఐ, బంగ్లాదేశ్, జింబాబ్వే తదితర దేశాలు అప్పోజ్ చేశాయి. చిన్న జట్లకు దీని వల్ల నష్టం ఏర్పడుతుందని, అలాగే రెవెన్యూ లాస్ కూడా వస్తుందని బీసీసీఐ వాదించింది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత బోర్డు తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ మోడల్ ఏమాత్రం ఆకర్షణీయంగా లేకపోవడంతో టూ టైర్ సిస్టమ్ తీసుకురావాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆసీస్ బోర్డు చైర్మన్ మైక్ బియర్డ్, ఇంగ్లాండ్ బోర్డు చీఫ్ రిచర్డ్ థాంప్సన్ లను జై షా కలిసే అవకాశముంది. అలాగే బీసీసీఐ నుంచి అధ్యక్షుడు రోజర్ బిన్నీ వచ్చే అవకాశముంది.
ఈనెల 12 న బీసీసీఐ ఎస్ జీఎం
ఇక బోర్డు కార్యదర్శిగా జై షా రాజీనామా చేయడంతో ఈ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశం జరుగనుంది. ప్రస్తుత తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియా ఎన్నికయ్యి పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మరోవైపు టూ టైర్ టెస్ట్ సిస్టం గురించి బీసీసీఐ వర్గాలు పెదవి విప్పలేదు. ప్రస్తుతం ఈ సిస్టం గురించి చర్చ జరగడం లేదని, గతంలో దీనిపై బోర్డు ఆలోచన చేసిందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఐసీసీ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తే 2027 తర్వాత గ్రూపుల మాదిరిగా విడిపోయి జట్ల మధ్య టెస్టులు జరిగే అవకాశముంది.
ఇక 2025 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పైనల్ జూన్ లో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఇది మూడో ఎడిషన్ ఫైనల్ కావడం విశేషం. 2021లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్, 2023లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ఐసీసీ గదను అందుకున్నాయి.