ICC Awards 2023: సూర్య భాయ్ సాధించేశాడు, టీ 20 క్రికెట్ ఆఫ్ ఇయర్ 2023
Suryakumar Yadav: ఐసీసీ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023 అవార్డును టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గెలుచుకున్నాడు.
ఐసీసీ(ICC) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023(T20 Cricketer of the Year Award 2023) అవార్డును టీమిండియా(Team India) విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) గెలుచుకున్నాడు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా నిలిచి పొట్టి క్రికెట్‌లో తన మార్క్ చాటాడు. టీ 20లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్... జింబాబ్వే సారథి సికిందర్ రజా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్క్ చాప్‌మన్, ఉగాండా సంచలనం అల్పేష్ రమ్జానీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి ఈ అవార్డు సూర్య భాయ్‌నే వరించింది.
సూర్య విధ్వంసం...
సూర్యకుమార్ యాదవ్ 2023లో పరుగుల వరద పారించాడు. సఫారీ గడ్డపై తాజాగా సెంచరీతో ఈ ఫార్మాట్‌లో నాలుగో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్ 155.95 స్ట్రైక్ రేటుతో 733 రన్స్ కొట్టాడు.
ఐసీసీ టీ 20 జట్టు కెప్టెన్‌గానూ...
టీమిండియా(Team India) టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(International Cricket Council).. క్రికెట్లోని ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీంలను ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికిగానూ అంతర్జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఆసిస్ నుంచి ఒక్కరూ లేరు...
2023 ఐసీసీ టీ 20 జట్టులో ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కూడా స్థానం దక్కకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రానిస్ హెడ్, వార్నర్, కమిన్స్ సహా చాలా మంది ఆటగాళ్లున్న వారెవరికీ స్థానం దక్కలేదు. సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లకూ ఈ జట్టులో స్థానం దక్కలేదు.
పొట్టి ప్రపంచకప్‌లో సూర్యనే కీలకం
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోఅందరి కళ్లూ సూర్యకుమార్‌యాదవ్‌పైనే ఉన్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీ20ల్లో అదరగొట్టేస్తున్న సూర్య.. వన్డేల్లో తడబాటుకు గురి కావడంపైనా స్పందించాడు. టీ20ల్లో క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అని... అతడొక విలక్షణ ప్లేయర్ అని నాజర్ హుస్సేన్ అన్నాడు. టీ20ల్లో మాత్రం ప్రతిసారి అతడి ఇన్నింగ్స్ అద్భుతమే. టీ 20ల్లో సూర్య బ్యాటింగ్ చూడటం మజాగా అనిపిస్తుందని... వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడిగా సూర్య నిలుస్తాడని భావిస్తున్నాని హుస్సేన్ విశ్లేషించాడు.