ICC Test Team Of The Year 2024: ముగ్గురు భారతీయ ప్లేయర్లకు చోటు.. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి నలుగురు.. పాక్, సౌతాఫ్రికా నుంచి నిల్..
ICC Test Team Of The Year 2024: బీజీటీలో బుమ్రా తన విశ్వరూపం ప్రదర్శించాడు. 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

Jasprit Bumrah News: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హవా మాములుగా లేదు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు టీం ఆఫ్ ద ఇయర్-2024కి సంబంధించి విడుదల చేసిన జాబితాలో తాను స్థానం సంపాదించుకున్నాడు. గతేడాది టెస్టుల్లో విశేషంగా రాణించి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో అయితే తన విశ్వరూపం ప్రదర్శించాడు. 32 వికెట్లతో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే ఆసీస్ గడ్డపై ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అవతరించాడు. సిడ్నీలో జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెన్ను నొప్పి కారణంగా బరిలోకి దిగలేదు కానీ, లేకుంటే మరి కొన్ని రికార్డులను తుడిచి పెట్టేవాడు. అయితే ఆ ఏడాదంతా విశేషంగా రాణించిన బుమ్రా ప్రతిభను ఐసీసీ గుర్తించి, తాజాగా తన టెస్టు టీం ఆఫ్ ద ఇయర్ లో చోటు కల్పించింది. అలాగే డిసెంబర్ నెలకు గాను టెస్టు క్రికెటర్ ఆఫ్ ద మంత్ అవార్డును కూడా ఐసీసీ నుంచి పొందాడు.
టీమ్ లో మరో ఇద్దరు భారతీయులు..
ఇక ఈ టీమ్ లో బుమ్రాతోపాటు విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. బీజీటీ 2024లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా యశస్వి ఘనత వహించాడు. 391 పరుగులతో వారెవా అనిపించాడు. ఓవరాల్ గా తనే సిరీస్ లో రెండో లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు జడేజా మూడు మ్యాచ్ ల్లో ఆడి 135 పరుగులతో పాటు నాలుగు వికెట్లు కూడా తీశాడు. దీంతో ఆల్ రౌండర్ కోటాలో జడ్డూకు చోటు దక్కింది. ఇక టీమ్ కు కెప్టెన్ గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో ఆసీస్ ను ముందుండి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రపంచకప్ ను సాధించడంతోపాటు టెస్టు చాంపియన్షిప్, బీజీటీని కూడా పదేళ్ల తర్వాత ఆసీస్ కు సంపాదించి పెట్టాడు. ఈ ఘనతలన్నీ పరిగణలోకి తీసుకున్న ఐసీసీ తనకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది.
ఇంగ్లాండ్ నుంచి అత్యధికంగా..
ఇక ఈ టీమ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల హవా కొనసాగించింది. బజ్ బాల్ మంత్ర పఠిస్తూ, టెస్టులను జనరంజకంగా ఇంగ్లీష్ ప్లేయర్లు మారుస్తున్నారు. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలిస్తున్నారు. దీంతో నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. వీరిలో సెంచరీల మీద సెంచరీలు కొట్టిన జో రూట్, ట్రిపుల్ సెంచరీ చేసిన హేరీ బ్రూక్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్, విధ్వంసక ఓపెనర్ బెన్ డకెట్ లకు చోటు దక్కింది. అలాగే న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక, ఆసీస్ ల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర టెస్టు ప్లేయింగ్ దేశాల నుంచి ఎవరికీ చోటు దక్కలేదు.
ఐసీసీ టెస్టు టీం ఆఫ్ ద ఇయర్ 2024 జట్టు:
ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), బెన్ డకెట్, హారీ బ్రూక్, జో రూట్, జేమీ స్మిత్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్).
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

