Greatest Revelry: క్రికెట్ ఫ్యాన్స్‌కు నెట్ ఫ్లిక్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ - ఇండో - పాక్ క్రికెట్ డాక్యుమెంటరీ రెడీ, ఏరోజు టెలికాస్ట్ అవుతుందంటే?
Netflix Offer: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవల్రీ అంటే ఇండియా, పాక్ ల మధ్యనే. ఈ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ ముందు యాషెస్ కూడా చిన్నబోతుంది. ఈ మ్యాచ్‌లపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.

Ind Vs Pak: భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లంటే గతంలో హై వోల్టేజీ యాక్షన్ ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఏదో 144 సెక్షన్‌తో కర్ఫ్యూ పెట్టినట్లు, ఊర్లలోని రహదారులన్నీ నిర్మానుష్యమయ్యేవి. జయాపజయాలను ఇరు జట్ల ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకునేవారు. ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఆడుతున్నప్పుడు కప్పు గెలవకపోయినా ఫర్లేదు కానీ, చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో మాత్రం ఎలాగైనా గెలవాల్సిందే అని పట్టు పట్టేవారు. ఆ స్థాయిలో ఉండేది. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యధిక మంది స్టేడియానికి వీక్షించిన మ్యాచ్ కూడా ఇరుజట్ల మధ్య జరిగిందే. 1999లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 4.5 లక్షల మంది హాజరయ్యారు. పాతికేళ్లు గడిచినా ఈ రికార్డు నేటికీ చెక్కు చెదరలేదు. అలాంటి భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్‌పై ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. వచ్చే నెల 7న ఇది ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
దిగ్గజాలతో ఇంటర్వ్యూలు..
గ్రేటెస్ట్ రైవలరీ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. ఇరుదేశాలకు చెందిన ఎంతోమంది దిగ్గజాలతో ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచింది. ముఖ్యంగా నజఫ్ గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్, కోల్కతా ప్రిన్స్ అండ్ దాదా సౌరవ్ గంగూలీ, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్, వకార్ యూనిస్, జావేద్ మియాందాద్, రవిచంద్రన్ అశ్విన్, ఇంజమాముల్ హఖ్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ లాంటి వాళ్ల అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచింది. ఇరుజట్ల మధ్య ఆడుతున్నప్పుడు జరిగిన సంఘటనలు, ఎమోషన్ డ్రామా, ఇతర సరదా సీన్లను మళ్లీ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. చంద్రదేవ్ భగత్, స్టీవార్ట్ సగ్ ద్వయం ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ఇందులో తొలి ఇండో-పాక్ వన్డే మ్యాచ్ గురించిన విశేషాలను కూడా పొందు పరిచారు.
వచ్చేనెలలో ఇరుజట్ల మధ్య పోరు..
దాయాదుల మధ్య వన్డే మ్యాచ్ వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరును చూడాలని అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. సరిగ్గా ఈ మెగాటోర్నీకి కాస్త ముందుగా ప్రేక్షకులకు ఈ డాక్యుమెంటరీన నెట్ ఫ్లిక్స్అందుబాటులోకి తీసుకు వస్తోంది. గ్రేటెస్ట్ రైవలరీ పేరుతో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీలో వివిధ మ్యాచ్ లలోని డ్రామ, ప్యాషన్, ఇంటెన్సినీ అభిమానులకు పరిచయం చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇటీవల కాలంలో పాక్ కొద్దిగా క్షీణించడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు అంత పోటాపోటీగా జరగడం లేదనన్నది విశ్లేషకుల వాదన. అందుకు తగినట్లుగానే, గత పదేళ్లలో చూసుకుంటే రెండు, మూడు విజయాలను మాత్రమే పాక్, ఇండియాపై సాధించింది. మిగాతా అన్ని మ్యాచ్ ల్లో భారత్ గెలుపొందింది. అలాగే చాంపియన్స్ ట్రోఫీలో కుదిరితే మరో రెండు మ్యాచ్ ల్లో దాయాదులు ఆడే అవకాశముంది. వచ్చేనెల 19 నుంచి చాంపియన్స్ టోర్నీ జరుగుతుంది. 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్ జట్లతో భారత్ తలపడనుంది. మొత్తం మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయి.




















