Glenn Maxwell Record: కపిల్‌ను తలపించేలా.. నవ చరిత్ర లిఖించేలా, మ్యాక్స్‌వెల్ విధ్వంసం
Glenn Maxwell Record: కపిల్ ఇన్నింగ్స్ నవ చరిత్రకు నాంది పలికితే.. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ సరికొత్త బ్యాటింగ్ పాఠాలకు మార్గనిర్దేశనం చేసింది.
Glenn Maxwell Record: అది 1983 జూన్ 18... భారత్ క్రికెట్‌లో సువర్ణ యుగానికి అప్పుడే నాంది పడింది. క్రికెట్ ప్రపంచమే అత్యద్భుతమే అనే ఇన్నింగ్స్‌ను ఆరోజు లెజెండ్ కపిల్‌దేవ్(Kapil Dev) ఆడాడు. ఇక ఓటమి ఖాయమని జట్టులోని సభ్యులే నిర్ణయించుకున్న వేళ... చూస్తున్న కొందరు అభిమానులు వెనుదిరుగుతున్న వేళ కపిల్ సృష్టించిన విధ్వంసం ఆ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.
అది ప్రపంచకప్(World Cup 1983). టీమిండియా ఆ మహా సంగ్రామంలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe)తో తలపడుతోంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఓడిపోయి వెనుదిరుగతుందని అంతా భావించారు. కేవలం 17 పరుగులకే టీమిండియా(Team India) అయిదు వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో కపిల్ దేవ్ తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. 175 పరుగుల చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో కపిల్ జట్టును గెలిపించాడు, 17 పరుగులకే అయిదు పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను 266 పరుగులు చేసేలా చేశాడు. మొత్తం జట్టు చేసిన 266 పరుగుల్లో కపిల్ చేసినవే 175 పరుగులు. కపిల్ సృష్టించిన విధ్వంసానికి జింబాబ్వే ఆటగాళ్లు బేల మొహం వేయాల్సి వచ్చింది. ఆ ఇన్నింగ్స్‌తో కపిల్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. ప్రపంచకప్‌ను తొలిసారి స్వదేశం తీసుకొచ్చి భారత్‌లో క్రికెట్ స్వర్ణ యుగానికి నాంది పలికారు. ఆ ప్రపంచకప్‌లో కపిల్‌ది చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్. చరిత్రను సృష్టించిన ఇన్నింగ్స్. ఓ దేశ క్రికెట్ గతిని మార్చిన ఇన్నింగ్స్.
ఇది 2023 నవంబర్ ఏడు . 91 పరుగులకే ఏడు వికెట్లు. ప్రపంచకప్‌లో అప్ఘాన్(Afghanistan) అద్భుతానికి అంతా సిద్ధమైపోయారు. ఈసారి సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌ను చూస్తామని అంతా చర్చలు జరుపుతున్నారు. అఫ్గాన్ బౌలర్ల ముందు అయిదుసార్లు ప్రపంఛ ఛాంపియన్ ఆస్ట్రేలియా పప్పులు ఒడకడం లేదు. కంగారులకు భారీ ఓటమి తప్పదని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అప్పటికే మాజీ ప్రపంచకప్ ఛాంపియన్లు ఇంగ్లండ్(England), శ్రీలంక(Sri Lanka), పాకిస్థాన్(Pakistan)లకు షాక్ ఇచ్చి అఫ్గాన్ మాములు ఫామ్‌లో లేదు. పసికూన అన్న పదాన్ని మార్చేసి ఇప్పుడు అగ్రజట్టుగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ మరోసారి అద్భుతాన్ని సృష్టించేందుకు అంతా సిద్ధం చేసుకుంది. అఫ్గాన్ తర్వాతి మ్యాచ్ గురించి అభిమానులు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో చర్చించుకుంటున్నారు. ఇక క్రీజులో నిలిచిన స్పెషలిస్ట్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్‌వెల్ ఒక్కడే. అప్పటికే చేతికి చిక్కిన క్యాచ్‌ను అఫ్గాన్ వదిలిపెట్టేసింది. ఆ ఒక్కడే విధ్వంసం అయ్యాడు. తుపానుగా మారాడు. ఆ తుపాను సునామీగా మారి అఫ్గాన్‌ను ముంచేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధ్వంసమంది. ఇది క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని ఛేజింగ్ అది. బౌండరీలు చిన్నవైపోయాయా అనేలా.. ఇక చాలు ఆపెయ్ అని బంతే బాధపడేలా.... అఫ్గాన్ ఆటగాళ్లు నిర్వేదంలో కూరుకుపోయేలా మ్యాక్స్‌వెల్ సృష్టించిన విధ్వంసం సాగింది.
కపిల్ ఇన్నింగ్స్ నవ చరిత్రకు నాంది పలికితే.. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ సరికొత్త బ్యాటింగ్ పాఠాలకు మార్గనిర్దేశనం చేసింది. కపిల్‌దేవ్ ఇన్నింగ్స్ గురించి ఇప్పటికే ప్రపంచ క్రికెట్ అభిమానులు కథలుకథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ గురించి కూడా కొన్నేళ్లుపాటు అలాగే మాట్లాడుకుంటారు. అసలు ఆస్ట్రేలియా కూడా ఊహించని విజయాన్ని మ్యాక్స్‌వెల్ ఆ జట్టుకు అందించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో మ్యాక్సీ అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ చేసిన 201 పరుగుల్లో 144 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతని ఊచకోత ఎలా సాగిందో తెలుసుకోవచ్చు.. క్రికెట్ ప్రపంచం నుంచి మ్యాక్సీ అందుకో సెల్యూట్..