Indian Cricket Update: బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ముందు కఠిన సవాళ్లు- ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో!
Indian Cricket Update: ఫైనల్ గా భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త సెలక్షన్ కమిటీ ఖరారైంది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 5 పెద్ద నిర్ణయాలను కమిటీ నిర్ణయించనుంది.
Indian Cricket Update: ఫైనల్ గా భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త సెలక్షన్ కమిటీ ఖరారైంది. నిన్న బీసీసీఐ 5గురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని ఎంపికచేసింది. చేతన్ శర్మ తిరిగి ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎంపికయ్యారు. శివసుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శ్రీధరన్ శరత్ లు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు భారత జట్టుపై ఈ కమిటీ దృష్టిపెట్టనుంది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 5 పెద్ద నిర్ణయాలను కమిటీ నిర్ణయించనుంది. అవేంటో చూద్దామా..
2023 భారత క్రికెట్ కు పెద్ద సవాల్ గా నిలవనుంది. టీమిండియా క్రికెట్ లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత క్రికెట్ అభివృద్ధి కోసం సెలక్షన్ కమిటీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
1. టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్య శాశ్వత నియామకం
2023లో టీమిండియా టీ20 క్రికెట్ లో కొత్త తరానికి నాంది పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ లో హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది న్యూజిలాండ్ సిరీస్ లోనూ, ప్రస్తుతం ముగిసిన శ్రీలంకతో టీ20లకు జట్టును నడిపించాడు. అయితే హార్దిక్ ను టీ20లకు శాశ్వత కెప్టెన్ గా బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే అది లాంఛనమే అనిపిస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ కుర్రాళ్లకు పెద్దపీట వేస్తోంది. అందుకే హార్దిక్ ను టీ20 కెప్టెన్ గా చూస్తోంది. ఇదే కనుక జరిగితే భారత క్రికెట్లోనూ స్ల్పిట్ కెప్టెన్సీ విధానం అమల్లోకి వస్తుంది. రోహిత్ శర్మ వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు.
2. టీ20ల నుంచి సీనియర్లకు సెలవు
ఇకనుంచి టీ20లకు సీనియర్లను మినహాయించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ముగిసిన శ్రీలంక సిరీస్ అందుకు ఉదాహరణగా కనపడుతోంది. ఈ సిరీస్ కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి వారిని ఎంపిక చేయలేదు. టీ20 జట్టును యువకులతో నిర్మించాలని భావిస్తోంది. 2024 పొట్టి ప్రపంచకప్ కోసం కుర్రాళ్లను ఇప్పటినుంచే సానబెట్టాలని బీసీసీఐ యోచిస్తోందట. అందుకే ఇక వారిని టీ20ల్లోకి తీసుకోమని సీనియర్లకు చెప్పినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
3. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఆటగాళ్ల ఎంపిక
గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. అప్పటినుంచి పొట్టి ఫార్మాట్ లో భారత జట్టులో మార్పులు జరగాలనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లే బీసీసీఐ కుర్రాళ్లను ఎంపిక చేసింది. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. శ్రీలంకతో సిరీస్ కు శివమ్ మావి, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వారిని తీసుకుంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని యువ జట్టును ఐసీసీ ఈవెంట్ కోసం సానబెట్టాలని నిర్ణయించింది. అలాంటి ఈ మెగా టోర్నీ కోసం కొంతమంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన ప్రాబబుల్స్ ను ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అలాగే టీ20ల కోసం కొందరు ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనుంది.
4. వారసత్వ ప్రణాళిక – వన్డేలు, టెస్టుల్లో రోహిత్ తర్వాత ఎవరు?
Picture perfect! 📷 #TeamIndia pic.twitter.com/N68FerBHOk
— BCCI (@BCCI) January 7, 2023
టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు. అతను ఇంకో రెండేళ్ల కంటే ఎక్కువగా క్రికెట్ లో కొనసాగలేకపోవచ్చు. గతేడాది నుంచి రోహిత్ ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కు రోహితే సారథ్యం వహించనున్నాడు. అయితే ఆ తర్వాత వన్డే జట్టును నడిపించేది ఎవరు అనే ప్రశ్న ఎదురవుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ కచ్చితంగా దీనికి సమాధానం వెతకాల్సి ఉంది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తో పాట్ మరికొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాహుల్ ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. సూర్య టీ20ల్లో రాణిస్తున్నాడు కానీ వన్డేల్లో ఇంకా నిరూపించుకోలేదు. కాబట్టి రోహిత్ తర్వాత నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో అది సెలక్టర్లు నిర్ణయించాల్సి ఉంది.
5. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ భవిష్యత్తు
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ పై ప్రశ్నలు తలెత్తాయి. ద్రవిడ్ పద్ధతులపై చర్చ జరిగింది. డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత ద్రవిడ్ జట్టు సెలక్షన్ పై చాలామంది విమర్శలు గుప్పించారు. ఫిట్ నెస్ లేని ఆటగాళ్లను ఆడేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నలు తలెత్తాయి. దీని తర్వాత కోచింగ్ లోనూ స్ల్పిట్ పద్దతిని అవలంభించాలని సూచనలు వచ్చాయి. ద్రవిడ్ పనిభారం తగ్గించేందుకు ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కోచ్ ను నియమించాలని అభిప్రాయాలు వినిపించాయి. అయితే బీసీసీఐ మాత్రం ప్రస్తుతానికి రాహుల్ ద్రవిడ్ కు మరో అవకాశం ఇచ్చింది. శ్రీలంకతో టీ20, వన్డేలకు ద్రవిడే కోచ్ గా ఉన్నాడు. మరి భవిష్యత్తులో స్ల్పిట్ పద్ధతిని బీసీసీఐ తీసుకొస్తుందో లేదో చూడాలి.
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
— BCCI (@BCCI) January 7, 2023
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y