Gambhir as Global Mentor: గౌతమ్ గంభీర్‌కు ప్రమోషన్! గ్లోబల్ మెంటార్‌గా ఎంపిక
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ప్రమోషన్ వచ్చింది! సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్‌జీ గ్రూప్ (RPSG Group) అతడిని 'గ్లోబల్ మెంటార్'గా నియమించుకుంది.
Gambhir as Global Mentor: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ప్రమోషన్ వచ్చింది! సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్‌జీ గ్రూప్ (RPSG Group) అతడిని 'గ్లోబల్ మెంటార్'గా నియమించుకుంది. అంటే ఎస్‌ఏ20 టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు అతడు మెంటార్‌గా వ్యవహరిస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో అతడు లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగులోకి లక్నో సూపర్ జెయింట్స్ కొత్తగా వచ్చిన సంగతి తెలిసిందే. అరంగేట్రం సీజన్లోనే జట్టు ప్లేఆఫ్స్ చేరుకొని సత్తా చాటింది. ఇందుకు గౌతమ్ గంభీర్ మెంటారింగ్ కారణమని చెప్పొచ్చు. రెండుసార్లు ఐపీఎల్ గెలిపించిన అతడి అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి అతడు మెరుగులు దిద్దాడు. అతడిలో దూకుడు పెంచాడు. స్ట్రాటజిక్ టైమ్‌ఔట్‌లో మైదానంలోకి వచ్చి కీలకమైన సలహాలు ఇచ్చాడు. మ్యాచులు ముగిశాక డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడాడు.
🚨 Announcement Alert 🚨
— Lucknow Super Giants (@LucknowIPL) October 7, 2022
We are 𝕤𝕦𝕡𝕖𝕣 𝕕𝕖𝕝𝕚𝕘𝕙𝕥𝕖𝕕 to announce Mr. Gautam Gambhir as the Global Mentor of our Super Giant family 🤩#LucknowSuperGiants | #LSG | #DurbansSuperGiants | #DSG pic.twitter.com/dvVnohLVA2
సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్షిణాఫ్రికా టీ20 లీగులో డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అతి త్వరలోనే మ్యాచులు మొదలవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు గంభీర్‌ను మెంటార్‌గా ఎంపిక చేశారు. 'ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని అత్యంత చురుకైన బుర్రల్లో అతనొకడు. భారత పరిస్థితుల్లోనే కాకుండా అంతర్జాతీయంగా అతడు క్రికెట్‌కు విలువ తీసుకురాగలడు' అని ఆర్పీఎస్‌జీ గ్రూప్ తెలిపింది.
'నా ఐడియాలజీ ప్రకారం బృంద క్రీడల్లో పదవులకు ఎక్కువ పాత్రేమీ ఉండదు. ఒక జట్టు విజయం సాధించేందుకు అవసరమైన ప్రక్రియకు సాయపడేందుకే సహాయ బృందం ఉంటుంది. సూపర్ జెయింట్స్ గ్లోబల్ మెంటార్‌గా నేను మరింత బాధ్యత తీసుకుంటాను. గెలవాలన్న నా అభిరుచి, తీవ్రకు అంతర్జాతీయ రెక్కలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ జెయింట్స్ కుటుంబం తనదైన ముద్ర వేయాలనుకుంటోంది. నాపై నమ్మకం ఉంచినందుకు సూపర్ జెయింట్స్‌కు కృతజ్ఞతలు. ఇకపై మరికొన్ని నిద్రలేని రాత్రులు గడపాలి' అని గంభీర్ అన్నాడు.
డర్బన్ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ లాన్స్ క్లూసెనర్‌తో కలిసి గంభీర్ పనిచేస్తాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు సేవలందించేందుకు క్లూసెనర్ జింబాబ్వే పురుషుల జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం డర్బన్‌లో క్వింటన్‌డికాక్, జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టాప్లే, డ్వేన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహారాజ్, కైల్ అబాట్, దిల్షాన్ మదుశనక, వియాన్ ముల్దర్ ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఎస్‌ఏ20 ఆరంభమవుతోంది. ఈ లీగులోని ఆరు జట్లనూ ఐపీఎల్ యజమానులే సొంతం చేసుకోవడం గమనార్హం.