Unmukt Chand: ఒకప్పుడు భారత్ కెప్టెన్, ఇప్పుడు అమెరికా ప్లేయర్
Unmukt Chand: అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ 20 వరల్డ్‌కప్‌లో జూన్ 12న న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ స్టేడియంలో టీమిండియాతో అమెరికా జట్టు తలపడనున్న మ్యాచ్‌లో బరిలోకి ఉన్ముక్త్.
ఉన్ముక్త్ చంద్ ( Unmukt Chand) గుర్తున్నాడా..? 2012లో సారధిగా టీమిండియా(Team India)కు అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) అందించిన కెప్టెన్ ఉన్ముక్ చంద్. ఫైనల్లో సెంచరీతో కదంతొక్కి మరీ భారత్‌కు అండర్ 19 ప్రపంచకప్ అందించాడు. ఆ తర్వాత సీనియర్ జాతీయ జట్టులోకి అడుగు పెట్టకుండానే భారత క్రికెట్ నుంచి ఉన్ముక్త్ చంద్ రిటైర్ అయ్యాడు. కెప్టెన్‌గా అండర్-19 ప్రపంచకప్‌ను టీమ్ఇండియాకు అందించిన ఉన్ముక్త్ చంద్.. కేవలం 28 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కకపోవడం.... ఇదే సమయంలో అమెరికా(USA) నుంచి లీగ్‌ల్లో ఆడేందుకు ఆఫర్ రావడంతో ఉన్ముక్త్ భారత క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు. అనంతరం ఉన్ముక్ చంద్ అమెరికాకు వెళ్లి అక్కడ మేజర్ లీగ్ క్రికెట్‌తో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకొన్నాడు. బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ కూడా ఉన్ముక్త్ కావడం విశేషం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఉన్ముక్ చంద్ మళ్లీ బరిలోకి దిగాడు. అది కూడా విషయం కాదు అనుకుంటున్నారా... కానీ ఈ ఒకప్పటి టీమిండియా యువ సంచలనం బరిలోకి దిగింది భారత్ తరపున కాదు.. అమెరికా తరపున... టీ 20 ప్రపంచకప్‌లో అమెరికా తరపున ఉన్ముక్త్ చంద్ బరిలోకి దిగుతున్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటించాడు.
భారత్‌తో మ్యాచ్‌లో బరిలోకి...
అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ 20 వరల్డ్‌కప్‌లో.. జూన్ 12వ తేదీన న్యూయార్క్(New York)లోని నాసౌ కౌంటీ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో టీమిండియాతో అమెరికా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్ముక్త్ చంద్ సన్నద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అడుగులు వేస్తున్న అమెరికా జట్టు తరపున పొట్టి ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని ఉన్ముక్త్ అన్నాడు. భారత క్రికెట్ నుంచి వైదొలిగాక.. భారత జట్టుకు ప్రత్యర్థిగా ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాని కూడా తెలిపాడు. తనకు భారత్‌పై ఏ కోపం లేదని... ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై నా సత్తా నిరూపించుకోవాలనేది తన లక్ష్యమని ఉన్ముక్త్ వెల్లడించాడు.
ఇది ఉన్ముక్ కెరీర్
2012లో అండర్-19 భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్ చంద్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. భారత జట్టులోకి త్వరలోనే రంగప్రవేశం చేస్తాడని.. ఓ వెలుగు వెలుగుతాడని అందరూ భావించారు. కానీ అతడికి సరైన అవకాశాలు రాలేదు. భారత జట్టు తరఫున ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2014 ప్రపంచకప్ కోసం భారత జట్టుకు ఎంపికైనా ఆడేందుకు అవకాశం రాలేదు. 2011 ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్ అతడిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్, ముంబయి జట్లకు కూడా ఆడాడు. భారత్ దేశవాళీలో 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఉన్ముక్త్.. 31.57 సగటుతో 3379 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 41.33 సగటుతో 4505 పరుగులు చేశాడు. 77 టీ20 మ్యాచుల్లో 22.35 సగటుతో 1565 పరుగులు సాధించాడు.