Hemang Badani On Dravid: ద్రవిడ్ సీక్రెట్స్ - 3 గంటలు ఆడేందుకేనా 6 గంటలు రైల్లో వచ్చింది!
Hemang Badani On Dravid: చెన్నై లీగులో ఆడేందుకు రాహుల్ ద్రవిడ్ బెంగళూరు నుంచి రైల్లో వచ్చేవాడని మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ అన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాడని గుర్తు చేసుకున్నాడు.
Hemang Badani On Dravid:
చెన్నై లీగులో ఆడేందుకు రాహుల్ ద్రవిడ్ బెంగళూరు నుంచి రైల్లో వచ్చేవాడని మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ అన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాడని గుర్తు చేసుకున్నాడు. ఎన్ని గంటలు ఆడినా బంతిని మాత్రం గాల్లోకి ఆడేవాడు కాదన్నాడు. ఓసారి బోర్ కొట్టడం లేదా అని ప్రశ్నిస్తే 6.5 గంటలు ప్రయాణం చేసి వచ్చేది 3 గంటల్లో ఔటైపోవడానికా అని బదులిచ్చాడని చెప్పాడు. బుధవారం ద్రవిడ్ పుట్టినరోజు సందర్భంగా బదానీ ఈ సంగతులు పంచుకున్నాడు.
టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ జనవరి 11న 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ కోచింగ్ బృందంలో ఉన్న హేమంగ్ బదానీ తన మిత్రుడి రహస్యాలు వెల్లడించాడు. చిన్నప్పుడు చెన్నై లీగులో ఎలా ఆడేవాడో వివరించాడు. అతడి మనస్తత్వం సింపుల్‌గా ఉండేదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో పంచుకుంది.
'ద్రవిడ్ బెంగళూరులో ఉండేవాడు. అతడి క్రికెటేమో చెన్నైలో జరిగేది. అప్పట్లో చెన్నై లీగు ఎంతో కీలకం. అందులో ఆడేందుకు అతడు రైల్లో వచ్చేవాడు. క్రీజులోకి దిగి వరుస సెంచరీలు కొట్టేవాడు. నాకూ మంచి నైపుణ్యాలే ఉండేవి. కానీ బంతిని ఎక్కువగా గాల్లోకి లేపేవాడిని. దాంతో త్వరగా ఔటయ్యేవాడిని. రాహుల్ మాత్రం బంతిని నేలపై పరుగెత్తించేవాడు' అని హేమంగ్ బదానీ అన్నాడు. ఒకే తరహాలో ఆడితే బోర్ కొట్టడం లేదా అని ద్రవిడ్‌ను ప్రశ్నించానని అతడు చెప్పాడు.
'రాహుల్ బంతిని నేలపైనే పరుగెత్తిస్తాడు. దాంతో రాహుల్.. నువ్వు వరుస పెట్టి సెంచరీలు చేస్తున్నావు. బోర్ కొట్టడం లేదా? ఇంకేమైనా కొత్తగా ప్రయత్నించాలని అనిపించడం లేదా? అని అడిగాను. అప్పుడతను ఇలా బదులిచ్చాడు. హేమంగ్! నేనెప్పుడూ సింపుల్‌గా ఆలోచిస్తాను. రాత్రి రైల్లో వస్తాను. అప్పట్లో విమానాలు ఎక్కువుండేవి కావు. పైగా టికెట్ ధర చాలా ఖరీదు. రాత్రి రైలు అందుకొని ఆరున్నర గంటలు ప్రయాణించాలి. అలాంటప్పుడు కేవలం మూడు గంటలు ఆడేసి మళ్లీ ఆరున్నర గంటలు ప్రయాణించాలా? అందుకే కనీసం ఐదు గంటలు ఆడి సెంచరీ కొడతాను. నాకిదెంతో సింపుల్. అంత దూరం నుంచి వస్తాను కాబట్టి కనీసం ఐదు గంటలైనా ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటాను' అని చెప్పినట్టు హేమంగ్ వివరించాడు.
'అతడు నెట్స్ ప్రాక్టీస్ గురించి మరో విషయమూ చెప్పాడు. నెట్స్‌లో ఓ 20 నిమిషాలు ఆడతాం. ఆ తర్వాత బ్యాటర్‌కు ఏం పనుంటుంది? ఇంకో ఐదు నిమిషాలు ఆడాలి. అంటే మరో ఐదు బంతులు దొరుకుతాయి. లేదా మరో పది బంతులు దొరుకుతాయి. కోచ్.. నేనింకో ఐదు, పది నిమిషాలు ఆడతాను అని అడగాలి. బౌలర్‌ను మరో పది బంతులు విసరమని బతిమాలాలి. అదే మ్యాచులో సెంచరీ చేస్తే 150 లేదా 170 బంతులు దొరుకుతాయి. ఔటవ్వకపోతే ఇంకా బౌలింగ్ చేస్తారు. అదే నెట్స్‌లో అయితే బౌలర్‌ను బతిమాలాలి' అని రాహుల్ చెప్పినట్టు హేమంగ్ పేర్కొన్నాడు.
A 🤏 story overheard in our dressing room that will make you 🧡 birthday boy #RahulDravid a bit more! 🎂#OrangeArmy pic.twitter.com/5IBM8BIPeo
— SunRisers Hyderabad (@SunRisers) January 11, 2023