ICC Champions Trophy: ఆ ప్లేయర్ టీనేజరేం కాదు.. బెంచ్ పై కూర్చోపెట్టి అవమానించొద్దు.. తప్పకుండా ఆడించాల్సిందే
భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో అటగాడిగా కరుణ్ నిలిచాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే ట్రోఫీలో తను పరుగుల వరద పారిస్తుండటంతో టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Karun Nair News: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ ఈ మధ్య టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. ఇంతకాలంల అతని పేరు ఎక్కడ వినపడకపోయినా, చాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటనకు ముందు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. దేశవాళీ ప్రముఖ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ వన్డే ఫార్మాట్లోకి తనను ఎంపిక చేయాలని డిమాండ్ ను బలంగా కలిగించాడు. ఈ ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతున్న కరుణ్.. 752 సగటుతో 752 పరుగులు చేశాడు. అంటే తాను బరిలోకి దిగిన ఇన్నింగ్స్ ల్లో ఒకే ఒక్కసారి ఔటయ్యాడు. ఐదు సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఒకవేళ టీమిండియా కరుణ్ నాయర్ ను జట్టులోకి ఎంపిక చేస్తే, తప్పకుండా అతడిని ప్లేయింగ్ లెవన్ లో ఆడించాలని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామాన్ సూచించాడు. అలా చేయకుంటే అతడిని జట్టులోకి ఎంపిక చేసి లాభం లేదని పేర్కొన్నాడు.
తనేం టీనేజర్ కాదు..
33 ఏళ్ల కరుణ్ ను ఒకవేళ టీమిండియా జట్టులోకి తీసుకుంటే బెంచ్ పై కూర్చో పెట్టకూడదని రామన్ తెలిపాడు. జట్టులోకి కొత్తగా ఎంపికైన వారిని, టీనేజర్లు లేదా అంతగా అనుభవం లేని యువకులను రిజర్వ్ కేే పరిమితం చేస్తారని, అయితే కరుణ్ లాంటి ఆటగాడి విషయంలో ఇలా ప్రవర్తించవద్దని పేర్కొన్నాడు. మరోవైపు 2016 ఇంగ్లాండ్ పై సొంతగడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా మాత్రమే నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఇప్పటివరకు భారత్ తరపున రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. అయితే ఆ తర్వాత తన జోరును కొనసాగించడంలో విఫలమైన కరుణ్.. త్వరగానే తెరమరుగయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్ వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫికి ముందు భారీ స్కోర్లతో సత్తా చాటి ఆశలు రేపాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లు ఫామ్ లో లేకపోవడంతో కరుణ్ ను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
జట్టు ప్రకటనకు ముహుర్తం ఖరారు..
ఇక చాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు శనివారమే టీమిండియా ను ప్రకటించనున్నారు. ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ లకు చాంపియన్స్ ట్రోఫీతోపాటు వన్డే సిరీస్ లో రాణించడం తప్పనిసరి. లేకపోతే వారి స్థానాలు గల్లంతయ్యే అవకాశముంది. వచ్చేనెల 6 నుంచి ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభమువుతుంది. 6, 9, 12 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
ప్రతిష్టాత్మక చాంపియన్స్ టోర్నీకి సన్నాహకంగా ఈ సిరీస్ ను భారత్ ఉపయోగించుకోనుంది. ఆ తర్వాత వచ్చేనెల 20 నుంచి మెగాటోర్నీలో భారత్ తన ప్రస్థానం కొనసాగిస్తుంది. తొలుత 20న బంగ్లాదేశ్ తో, 23న పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ లన్నీ ఆడుతుంది. హైబ్రీడ్ పద్ధతితో జరిగే ఈ టోర్నీలో ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతాయి. చివరిసారిగా 2013లో భారత్ టోర్నీని నెగ్గింది. 2017లో పాక్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

