T20 Fastest Century: సునామీలా విరుచుకుపడ్డాడు, ఫాస్టెస్ట్ సెంచరీ చేసేశాడు
T20 Fastest Century: నమీబియా నయా సంచలనం నికోల్ లోఫ్టీ ఈటన్ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. 11 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు.
Jan Nicol Loftie Eaton Scores Fastest T20i Hundred: నమీబియా నయా సంచలనం నికోల్ లోఫ్టీ ఈటన్ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. అదేదో బంతిపై పగబట్టినట్లు చెలరేగిపోయాడు.ఈ విధ్వంసంతో పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఈటన్ అవతరించాడు. నేపాల్ వేదికగా నేపాల్, నమీబియా, నెదర్లాండ్స్ మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నేపాల్, నమీబియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్ ఈటన్ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. 11 ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఈటన్ 11 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. నికోల్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో నమీబియా విజయం సాధించింది. పొట్టి క్రికెట్‌లో నికొల్‌కు మంచి రికార్డు ఉంది. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకూ ఒక్క హాఫ్ సెంచరీ బాదలేదు.
టీ20ల్లో వేగవంతమైన సెంచరీలు..
జాన్ నికోల్ (నమీబియా) - 33 బంతులు
కుశాల్ మల్లా (నేపాల్) - 34 బంతులు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) - 35 బంతులు
రోహిత్ శర్మ (భారత్) - 35 బంతులు
సుదేశ్ విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్) - 35 బంతులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 22 ఏళ్ల జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. జాన్ నికోల్ లాఫ్టీ క్రీజులోకి వచ్చే సమయానికి నమీబియా స్కోర్ 10.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62గా మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో 200 దాటింది. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న జాన్ నికోల్ లాఫ్టీ 101 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ మలన్ క్రుగర్ 48 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలిచింది. నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లు పడగొట్టాడు. జాన్ నికోల్ లాఫ్టీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.