Virat Kohli Craze: క్రేజ్ కా బాప్.. కోహ్లీకి ఏమాత్రం తగ్గని క్రేజ్.. అతడిని చూడటానికి ఉ. 3 గంటల నుంచే స్టేడియానికి..
కోహ్లీని చూడటానికి ఉదయం 3 గంటల నుంచే అభిమానులు స్టేడియంలో బారులు తీరారు. అభిమానుల తాకిడికి స్టేడియం సందడిగా మారింది. తొక్కిసలాట జరగకుండా స్టేడియంలోని 3 గేట్లను తెరవాలని నిర్వాహకులు నిర్ణయించారు.
![Virat Kohli Craze: క్రేజ్ కా బాప్.. కోహ్లీకి ఏమాత్రం తగ్గని క్రేజ్.. అతడిని చూడటానికి ఉ. 3 గంటల నుంచే స్టేడియానికి.. fans lining up outside since 3am to enter the venue and they chanting relentlessly for Kohli Virat Kohli Craze: క్రేజ్ కా బాప్.. కోహ్లీకి ఏమాత్రం తగ్గని క్రేజ్.. అతడిని చూడటానికి ఉ. 3 గంటల నుంచే స్టేడియానికి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/57a7bb6b8a677ac049b86a7fe90302341738200982061936_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kohli In Ranji Trophy: ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో అంతగా రాణించకపోయినా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. 12 ఏళ్ల తర్వాత తను రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతుండటంతో అతడిని చూడటానికి ఉదయం 3 గంటల నుంచే అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బారులు తీరారు. ఇప్పటికే అభిమానుల తాకిడికి స్టేడియం చుట్టుపక్కలా సందడిగా మారింది. తొక్కిసలాట జరగకుండా స్టేడియంలోని మూడు గేట్లను తెరవాలని నిర్వాహకులు నిర్ణయించారు.
రైల్వేస్ తో గురువారం నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కేవలం బ్యాటర్ గానే బరిలోకి దిగుతున్నాడు. అతనికి కెప్టెన్సీ ఆఫర్ చేసినా, కోహ్లీ తిరస్కరించాడు. ఇక ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ మ్యాచ్ ఆడాడు. ఉత్తర ప్రదేశ్ పై నవంబర్ లో బరిలోకి దిగాడు. ఇక ప్రస్తుతం ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. నాకౌట్ కు చేరాలంటే రైల్వేస్ పై భారీ విజయం సాధించడంతోపాటు ఇతర సమీకరణాలు కలిసి రావాలి.
బీసీసీఐ ఆదేశాలతో..
గతేడాది సెకండ్ హాఫ్ నుంచి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ.. తిరిగి జట్టులో కుదురుకోవాలని భావిస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా టూర్లో కోహ్లీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ టూర్లో ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఒకే రకంగా కోహ్లీ ఔటవడం గమనార్హం. ముఖ్యంగా స్కాట్ బోలాండ్ తనను నాలుగు సార్లు పెవిలియన్ కి పంపించాడు. దీంతో కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కోచ్ గౌతం గంభీర్ సూచనపై ఇప్పటికే పలువురు భారత ప్లేయర్లు రంజీలు ఆడాలని నిర్ణయించుకోవడంతో కోహ్లీ కూడా డొమెస్టిక్ క్రికెట్ బరిలోకి దిగాడు. నిజానికి ఇంతకుముందే తను ఆడాల్సి ఉంది. సొంత జట్టు ఢిల్లీ రంజీ ప్రాబబుల్స్ లో కోహ్లీకి స్థానం కూడా కల్పించారు. . 23 నుంచి జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా దూరమయ్యాడు. నేటి నుంచి మొదలైన ఈ రంజీ మ్యాచ్ లో సత్తా చాటాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇక వచ్చేనెల 6 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఆడనుంది. ఆ సిరీస్ లో కోహ్లీ సత్తా చాటుతాడని పలువురు నమ్మకంగా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ వన్డే సిరీస్ లో ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు.
కఠినంగా వ్యవహరిస్తున్న బీసీసీఐ..
గతేడాది టెస్టుల్లో ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. టీమిండియా ఆటగాళ్లకు ఇప్పటివరకు బోర్డు ఎన్నో వెసులుబాటులు కల్పించింది. ఇకపై నుంచి అలాంటి వాటికి చోటు ఉండదని ప్రకటించింది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో వెళ్లిపోవడం, ప్రాక్టీస్ సెషన్ మొత్తం గడప కుండా ఉండటం వాటికి చెల్లుచీటీ పడింది. అలాగే దేశవాళీల్లో పాల్గొనడం కూడా తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా యువ ఆటగాళ్లకు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. మరోవైపు టూర్లలో తమ సహాయక సిబ్బందిని తెచ్చుకునే వెసులుబాటును కూడా ఉపసంహరించుకుంది. మేనేజర్, చెఫ్, సహాయకులు, భద్రతా సిబ్బంది తదితర సౌకర్యాలను ఉపయోగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. జట్టులో అందరూ సమానంగా ఉండాల్సిందేనని, ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పింది. అలాగే పర్యటనల్లో వ్యక్తిగత షూట్లు, ఎండార్స్ చేయకూడదని తెలిపింది. బీసీసీఐ రూపొందించే అన్ని షూట్లలోనూ ప్లేయర్లంతా పాల్గొనాల్సిందేనని కండీషన్లు పెట్టింది. ఇక ఆటపై ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని నిబంధనలు అమలు చేయనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలోనే స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)