ENG vs IRE: బ్యాటింగ్‌కు రాలె - బౌలింగ్ చేయలె - అయినా మ్యాచ్ గెలిచాడు - బెన్ స్టోక్స్ అరుదైన ఘనత
ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టులో స్టోక్స్ ఈ ఘనత అందుకున్నాడు.

ENG vs IRE: క్రికెట్ అంటేనే సమిష్టిగా ఆడే ఆట. ఏ ఒక్కరో ఇద్దరో ఆడితేనో.. బ్యాటింగ్ బాగా చేసి బౌలింగ్ ఇరగదీస్తేనో కాదు. అన్ని విభాగాలు తమ వంతు సాయం అందిస్తేనే విజయం సొంతం అవుతుంది. 11 మంది ఆడే ఈ ఆటలో బ్యాటర్లు, బౌలర్లను సమన్వయం చేసుకుంటూ నడిపే నాయకుడిది ఆటలో ముఖ్యమైన పాత్ర. సాధారణంగా కెప్టెన్ అయితే బ్యాటరో లేక బౌలరో అయి ఉంటాడు. ఈ రెండింట్లో ఏదో ఒకటి చేసి తన టీమ్‌కు మార్గదర్శకంగా నిలవాలి. కానీ ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్.. ఒక్క బంతి బౌలింగ్ చేయకుండా బ్యాట్ పట్టుకుని క్రీజులోకి రాకుండానే మ్యాచ్‌ను గెలిచిన సారథిగా రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా విజయం సాధించడం ఇదే ప్రథమం.
ఇంగ్లాండ్ - ఐర్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో స్టోక్స్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 56.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరఫున స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్ లు బౌలింగ్ చేసి పది వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 524 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (56) ఫర్వాలేదనిపించగా బెన్ డకెట్ (182), వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (205) వీరబాదుడు బాదారు. జో రూట్ (56) కూడా రాణించాడు. రూట్ నిష్క్రమించిన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను స్టోక్స్ డిక్లేర్ చేశాడు.
Ben Stokes is the first captain in Test history to win a match without batting, bowling and keeping. Not a bad way to earn ~16,000 pounds match fees. #EngvIre
— Mazher Arshad (@MazherArshad) June 3, 2023
రెండో ఇన్నింగ్స్ లో 352 పరుగులు వెనుకబడ్డ ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా తర్వాత కోలుకుంది. అండీ మెక్‌బ్రైన్ (86), మార్క్ అడైర్ (88) లు పోరాడటంతో ఆ జట్టు 86.2 ఓవర్లలో 9 వికెట్లు 362 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. బ్రాడ్, పాట్స్, టంగ్, లీచ్ తో పాటు జో రూట్ కూడా పది ఓవర్లు విసిరాడు. ఆ తర్వాత 10 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 4 బంతుల్లోనే ఛేదించింది. జాక్ క్రాలే మూడు ఫోర్లు కొట్టి ఆ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇంగ్లాండ్ జైత్రయాత్ర..
జో రూట్‌ను ఇంగ్లాండ్ టెస్టు జట్టు నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టుకు స్టోక్స్ కొత్త కెప్టెన్ గా వచ్చాడు. న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్‌కోచ్‌గా స్టోక్స్ ఇంగ్లాండ్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరూ బాధ్యతలు తీసుకున్నాక ఇంగ్లాండ్.. 13 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 11 టెస్టులు గెలిచింది. రెండింటిలో మాత్రమే ఓడింది. ‘బజ్‌బాల్’ ఆటను ప్రపంచ మేటి జట్లకు పరిచయం చేస్తున్న ఈ ద్వయానికి త్వరలోనే ఆసీస్ రూపంలో అసలైన సవాల్ ఎదురుకానుంది. ఆసీస్ - ఇంగ్లాండ్ మధ్య జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ మొదలుకానుంది.




















