Ashes 2023: ‘బ్రూమ్‌బ్రెల్లా’ ఫీల్డింగ్‌తో ఆశ్చర్యపరిచిన బెన్ స్టోక్స్ - ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పెట్టిన ఫీల్డింగ్ వైరల్ అవుతుంది.
Ashes 2023 Viral Video: యాషెస్ 2023 మొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విచిత్రమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆ సమయంలోనే ఉస్మాన్ ఖవాజా అవుటయ్యాడు. ఈ ఫీల్డింగ్ శైలికి 'బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్' అని పేరు పెట్టారు. అయితే ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఉస్మాన్ ఖవాజా అవుట్ కావడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఉస్మాన్ ఖవాజా 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ తర్వాత ఆలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా క్లీన్ బౌల్డయ్యాడు.
Only in Test Cricket 😍
— Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023
An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులో కంగారూలను విజయం ఊరిస్తోంది. ఏడు పరుగుల నామమాత్రపు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి తడబడింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు.. 66.2 ఓవర్లలో 273 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 280 పరుగుల విజయలక్ష్యం నిలిపింది.
దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదుచేయలేకపోగా భాగస్వామ్యాలు కూడా నిర్మించలేకపోయారు. మూడో రోజు 27 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు జో రూట్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఓలీ పోప్ (16 బంతుల్లో 14, 2 ఫోర్లు) మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ ధాటిగా ఆడగా పోప్ మాత్రం ఇబ్బందిపడ్డాడు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ వేసిన 17వ ఓవర్లో ఆరో బంతికి పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పోప్ నిష్క్రమించినా హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు) తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నడిపించిన రూట్‌ను స్పిన్నర్ నాథన్ లియాన్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే హ్యారీ బ్రూక్ కూడా లియాన్ బౌలింగ్‌లోనే లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ఇంగ్లాండ్ దూకుడు తగ్గించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (66 బంతుల్లో 43, 5 ఫోర్లు) నెమ్మదించగా బెయిర్‌స్టో (39 బంతుల్లో 20, 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. బెయిర్‌స్టోను లియాన్ వికెట్ల ముందు బలిగొనగా.. స్టోక్స్‌ను కమిన్స్ ఎల్బీగా వెనక్కిపంపాడు. మోయిన్ అలీ (31 బంతుల్లో 19, 2 ఫోర్లు, 1 సిక్స్) రాబిన్సన్ (44 బంతుల్లో27, 2 ఫోర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. జేమ్స్ అండర్సన్ (12) ను కమిన్స్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 273 పరుగుల వద్ద ముగిసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్‌తో పాటు లియాన్ తలా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను నిలువరించడంలో సక్సెస్ అయ్యారు. బొలాండ్, హెజిల్‌వుడ్‌లకు చెరో వికెట్ దక్కింది.