Asia Cup 2023: ఇప్పుడు నేనేం చేయలేను - ఆనిర్ణయానికి కట్టుబడాల్సిందే! - ఆసియా కప్‌పై వెనక్కి తగ్గిన అష్రఫ్
PCB vs BCCI: ఆసియా కప్ - 2023 నిర్వహణ విషయంలో నిన్న చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జకా అష్రఫ్ వెనక్కి తగ్గాడు.
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు త్వరలోనే అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జకా అష్రఫ్ ఆసియా కప్ - 2023 నిర్వహణపై నిన్న చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తగ్గాడు. తాను హైబ్రీడ్ మోడల్‌కు వ్యతిరేకమని దానిని వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పడంతో ఈ టోర్నీ మళ్లీ మొదటికే వచ్చిందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా దీనిపై స్పందించడం, సభ్య దేశాల్లో దీనిపై మరోసారి కన్ఫ్యూజన్ నెలకొనడంతో ఆయన మాట మార్చాడు.
అది నా వ్యక్తిగత అభిప్రాయం..
హైబ్రీడ్ మోడల్‌ను తిరస్కరిస్తున్నానని చెప్పిన అష్రఫ్ తాజాగా ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ హైబ్రీడ్ మోడల్ వల్ల పాకిస్తాన్‌కు ఒనగూరేదేమీ లేదని నేను చెప్పా. ఆతిథ్య హక్కుల మేరకు పాకిస్తాన్ మరికొన్ని మ్యాచ్‌లను పొంది ఉంటే బాగుండేది. కానీ అధికారిక హోస్ట్ పాకిస్తాన్ అయినా శ్రీలంకలోనే ముఖ్యమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇది పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూర్చేదా..?
కానీ దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. కావున ఇప్పుడు మేం దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు నాకు ఆ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేక వ్యతిరేకించడమో చేయాలన్న ఉద్దేశమూ లేదు. ఇప్పటికే జరిగిన నిర్ణయాన్ని నేను గౌరవించడం తప్ప మరేమీ చేయలేను. కానీ ఇకనుంచి తీసుకునే ఏ నిర్ణయమైనా దేశ ప్రయోజనాల కోసమే తీసుకుంటాం..’అని తెలిపాడు.
బుధవారం ఇస్లామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలతో ఆసియా సభ్య దేశాలలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఏసీసీ కూడా అష్రఫ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోకున్నా అతడి వ్యక్తిగత అభిప్రాయం వరకైతే ఫర్వాలేదు గానీ దాని వల్ల టోర్నీకి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదనే ఆందోళనలో ఉంది. అయితే ఇప్పటికే 9 నెలల నుంచి సాగుతున్న చర్చలు ఇటీవలే ఓ కొలిక్కి వచ్చి ఆమోదించిన నిర్ణయాన్ని తప్పుబడితే అందువల్ల నష్టపోయేది పాకిస్తానే అన్న సంగతి గ్రహించిన పీసీబీ కాబోయే చీఫ్.. మాట మార్చి మళ్లీ ‘అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’అని కొత్త రాగం అందుకోవడం విశేషం.
I Reject The Hybrid Model proposed from Najam Sethi. We will fully host Asia Cup. #AsiaCup2023 pic.twitter.com/jbJ0WLLkJn
— Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) June 21, 2023
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ప్రకారం అష్రఫ్ మాట్లాడుతూ.. 'నేను మొదటి నుంచీ చెప్పేది ఒకటే! హైబ్రీడ్ మోడల్‌ను తిరస్కరిస్తున్నాను. గతంలోనూ ఇదే మాట చెప్పాను. ఆసియాకప్‌ను పాక్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అలాంటప్పుడు మేమే ఆతిథ్యం ఇవ్వాలి. అసలైన మ్యాచులన్నీ పాకిస్థాన్ బయటే జరుగుతున్నాయి. నేపాల్, భూఠాన్ వంటి జట్లే ఇక్కడ ఆడుతున్నాయి. అది పాకిస్థాన్‌కు అన్యాయమే అవుతుంది. దేశ క్రికెట్ భవిష్యత్తు కోసం పాత నిర్ణయాలను సమీక్షిస్తాను. పీసీబీకి కొన్ని సవాళ్లు ఉన్నాయి. పరిష్కరించుకోవాల్సి సమస్యలు ఉన్నాయి. ఆసియాకప్, ప్రపంచకప్, జట్టు సన్నద్ధమవ్వడం వంటివి చాలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial