Cyclone Michaung: నీట మునిగిన చెన్నై, క్రికెటర్ల ఆవేదన
Cyclone Michaung: మిచౌంగ్ తుపాను తమిళనాడును కుదిపేసింది. ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గు ముఖం పట్టినా కొన్ని కాలనీలు ఇంకా జల దిగ్బంధం లోనే ఉన్నాయి.
మిచౌంగ్ తుఫాన్ దెబ్బకి చెన్నై నగరం అతలాకుతలం అయిపోయింది. ఆదివారం రాత్రి నుంచి పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలో జీవనం స్తంభించి పోయింది. భారీ వర్షాలతో అటు ఇటు ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరదల దెబ్బకి రోడ్లపై నీరు నిలచిపోవడంతో చెన్నైలో రవాణా సేవలు స్తంభించాయి. రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. విమానాశ్రయంలోకి మోకాలు లోతు నీరు చేరిపోయింది. ఇళ్లలోపాలకి నీరు చేరటంతో ఎంతోమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు చెన్నై వర్షాలపై స్పందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలంటూ సూచిస్తున్నారు.
మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. వరద నీటి కారణంగా రోడ్డు కోతకు గురైన వీడియోను అశ్విన్ షేర్ చేశాడు. అలాగే నగరంలో విద్యుత్ లేదన్న ఒక పోస్ట్ ను రీ ట్వీట్ చేశారు.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, శ్రీలంక స్పిన్నర్, మహీశ్ థీక్షణ సైతం చెన్నై వరదలపై స్పందించాడు. "నా రెండో ఇళ్లు లాంటి చెన్నై నగరానికి సంబంధించిన ఓ వీడియో ఫుటేజీని ఇప్పుడే చూశా. అందరూ ధైర్యంగా ఉండండి. సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అలాగే టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వమంటూ కోరారు. ప్రజల కోసం కష్టపడుతున్న అధికారులు, సిబ్బందికి సెల్యూట్ అని చెప్పారు. కలిసికట్టుగా ఉందాం, ప్రతికూల పరిస్థితులను అధిగమిద్దాం అని పిలుపునిచ్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కూడా చెన్నై ప్రజలు ఇంట్లోనే ఉంటూ.. సురక్షితంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. దీన్ని రుతురాజ్ గైక్వాడ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్టు చేశాడు. అజింక్య రహానే సైతం చెన్నై వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించాడు. చెన్నై వరదలపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తన స్వదేశం తర్వాత భారత్ లో ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న వార్నర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వరదల మీద పోస్ట్ పెట్టాడు.సహాయం చేయగల స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు రావాలని.. అవసరమైన మేరకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు.
మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో చాలామంది సర్వస్వం కోల్పోయారు. గత రెండ్రోజుల్లో సైతం 45 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, రహదారులు అన్నీ చెరువుల్లా మారిపోయాయి. అయితే ప్రస్తుతం తుపాను తీరానికి చేరుకోవడంతో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నగరంలో కొన్ని చోట్ల నిలిచిన వర్షపు నీరు ఇంకిపోతోంది. దీంతో చెన్నై నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.