SL vs ZIM CWC Qualifiers: తీక్షణ మాయాజాలానికి జింబాబ్వేకు ఓటమి - వన్డే ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకున్న శ్రీలంక
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కంటే ముందు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్ మ్యాచ్ లలో శ్రీలంక మరో విజయంతో ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకుంది.

SL vs ZIM CWC Qualifiers: 1996 పురుషుల వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ శ్రీలంక.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీలలో భాగంగా ఆదివారం జింబాబ్వేతో ముగిసిన సూపర్ సిక్సెస్ పోరులో ఆతిథ్య జింబాబ్వే జట్టును చిత్తుగా ఓడించి ప్రపంచకప్ లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. లంక స్పిన్నర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే మహీశ్ తీక్షణ స్పిన్ మాయాజాలానికి ఈ టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూకుడుమీదున్న జింబాబ్వే కుదేలైంది.
మధుశంక, తీక్షణ సూపర్ షో..
బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలుత టాస్ గెలిచి జింబాబ్వేకు బ్యాటింగ్ అప్పగించింది. తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ గుంబీ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (14) కూడా నిరాశపరిచాడు. వన్ డౌన్ లో వచ్చిన మధెవెరె (1) సైతం విఫలమయ్యాడు. ఈ మూడు వికెట్లు పేసర్ దిల్షాన్ మధుశంకకు దక్కాయి.
30కే మూడు వికెట్లు పడ్డ జింబాబ్వేను సీన్ విలియమ్స్ (57 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్సర్), సికిందర్ రజా (51 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. కానీ లంక సారథి దసున్ శనక.. రజాను ఔట్ చేయడంతో జింబాబ్వే కోలుకోలేదు. రజా నిష్క్రమించిన తర్వాత తీక్షణ జింబాబ్వే పనిపట్టాడు. హాఫ్ సెంచరీ చేసిన విలియమ్స్ ను బౌల్డ్ చేసిన అతడు.. తర్వాతి ఓవర్లో ర్యాన్ బుర్ల్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. ఇదే ఊపులో జోంగ్వ్ (4) ను ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో 32.2 ఓవర్లలోనే జింబాబ్వే 165 పరుగులకే ఆలౌట్ అయింది.
నిస్సంక సెంచరీ..
చేయాల్సింది తక్కువ లక్ష్యమే కావడంతో లంక ఆడుతూ పాడుతూ ఛేదన చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (102 బంతుల్లో 101, 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (56 బంతుల్లో 30, 2 ఫోర్లు).. సెంచరీ భాగస్వామ్యం (103) తర్వాత నిష్క్రమించినా కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 25, 2 ఫోర్లు) తో కలిసి పని పూర్తి చేశాడు. 33.1 ఓవర్లలోనే లంక ఒక వికెట్ నష్టానికి 169 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
Sri Lanka are #CWC23 bound 🤩🇱🇰 pic.twitter.com/DfV6N7TSKY
— ICC (@ICC) July 2, 2023
బెర్త్ కన్ఫర్మ్..
జింబాబ్వేను ఓడించడంతో శ్రీలంక వన్డే వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేసుకుంది. సూపర్ సిక్సెస్ లో ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. సూపర్ సిక్సెస్ లో ప్రత్యర్థి గ్రూపు జట్లతో మూడు మ్యాచ్ లు ఆడే జట్టు కనీసం రెండు గెలిచినా వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం (చివరికి పాయింట్ల పట్టికలో టాప్ - 2 జట్లు మాత్రమే ప్రపంచకప్ కు అర్హత సాధిస్తాయి) ఉండటంతో లంక.. నెదర్లాండ్స్, జింబాబ్వేలను ఓడించి గ్రూప్ టాపర్ గా ఉంది. ఇక ఆ జట్టు జులై 07న వెస్టిండీస్ తో పోటీ పడనుంది. పాయింట్ల పట్టిక ప్రకారం ఇప్పటివరకు సూపర్ సిక్సెస్ లో ముగిసిన మ్యాచ్ ల తర్వాత శ్రీలంక టాప్ లో ఉండగా జింబాబ్వే రెండో స్థానంలో ఉంది. జింబాబ్వే మరో మ్యాచ్ గెలిస్తేనే తన స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రపంచకప్ కు కూడా అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

