Ind Vs Aus Test Series: బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్లు క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
Boxing day test: ఆసీస్ లో బాక్సింగ్ డే టెస్టు క్రేజ్ మాములుగా ఉండదు. లక్ష మంది సామర్థ్యం గల ఈ స్టేడియంలో టికెట్లను ఇలా అమ్మకానికి పెట్టగానే, అలా సేల్ అయిపోయాయి.
BGT: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) హోరాహోరీగా సాగుతోంది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ ప్రతి టెస్టుకు ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు అభిమానులు హాజరై, మ్యాచ్ లను ఆస్వాదించారు. ఇక నాలుగో టెస్టు వేదికైన మెల్ బోర్న్ లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లాగా అమ్ముడు పోయాయి.
ఈ టెస్టు ఈనెల 26 నుంచి 31 వరకు జరుగుతుంది. ప్రతీ ఏటా క్రిస్మస్ పండుగ తర్వాత రోజున ఆసీస్ జట్టు టెస్టును ఆడటం ఆనవాయితీగా వస్తోంది. బాక్సింగ్ డే రోజున ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, దీన్ని బాక్సింగ్ డే్ టెస్టు అని పిలుస్తారు. అయితే మ్యాచ్ వేదికైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ స్టేడియం సామర్థ్య లక్ష మంది. అయితే ఈ వేదికపై జరిగే టెస్టుకు సంబంధించి మొదటి రోజు టికెట్లన్నీ 15 రోజుల ముందుగానే అమ్ముడు పోవడం విశేషం.
ఆసీస్ లో టెస్టులంటే పండుగ..
నిజానికి ప్రపంచవ్యాప్తంగా టెస్టులకు ఆదరణ కరువవుతుంటే ఇంగ్లాండ్, ఆసీస్ లాంటి దేశాల్లో టెస్టులకు ఇప్పటికీ ఫుల్లు క్రేజు ఉంది. తమ అభిమాన జట్టు మ్యాచ్ ఆడుతుంటే మైదానాలకు వేలం వెర్రిగా అభిమానులు వస్తారు. ఇక భారత్ లాంటి మేటిజట్టుతో పోటీపడుతున్న ఆసీస్ ను ఉత్సాహపరిచేందుకు ఆ దేశ ఫ్యాన్స్ మెల్ బోర్న్ లో సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇంతపెద్ద స్టేడియంలో టికెట్లన్నీ రెండువారాల ముందగానే పూర్తిగా అమ్ముడు పోవడం చూసి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఫుల్లు జోష్ లో ఉంది. నిజానికి క్రికెట్ పై ప్రజల్లో క్రేజ్ పెంపొందించేందుకు సీఏ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పింక్ బాల్ తో డే/నైట్ టెస్టులాంటి వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టింది.
అడిలైడ్ లోనూ అదరగొట్టారు...
ఇక ఆసీస్ లో పింక్ బాల్ మ్యాచ్ లు జరిగే వేదికగా పేరు తెచ్చుకున్న అడిలైడ్ మైదానానికి స్థానిక అభిమానులు పోటెత్తారు. మూడు రోజుల్లో లక్షా 35 వేల 12 మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించినట్లు సీఏ తెలిపింది. మొదటి రెండురోజులలో రికార్డు స్థాయిలో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. తొలిరోజు 50,186 మంది హాజరు కాగా, రెండో రోజు 51,542 మంది హాజరయ్యారు. రెండో టెస్టులో తమ టీమ్ గెలుపు దిశగా సాగుతుండటంతో ఆసీస్ ఫ్యాన్స్ మైదానానికి ఉత్సాహంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగియడం విశేషం. లేకపోతే ఇంకా అభిమానులు ఈ మ్యాచ్ కు హాజరయ్యేవారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బ్రిస్బేన్ లో ఈనెల 14 నుంచి జరిగే మూడోటెస్టులో గెలుపు భారత్ కి తప్పనిసరి. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే కంగారూల పనిపట్టక తప్పదు. ఇందుకోసం భారత ఆటగాళ్లు నెట్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఏదేమైనా సరికొత్త వ్యూహాలతో గబ్బా స్టేడియంలో తన సత్తాచాటాలని టీమిండియా ఉవ్విళూరుతోంది.