(Source: ECI/ABP News/ABP Majha)
Ben Stokes : టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బెన్‌స్టోక్స్
T20 World Cup: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జూన్, జులై నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
Ben Stokes Rules Himself Out Of Contention For England 2024 T20 World Cup Squad: ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup2024) మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో భారీగా కాసులు కురిపించే టీ-20 క్రికెట్ కోసం ప్రముఖ ఆటగాళ్లంతా సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు డుమ్మా కొడుతుంటే ప్రపంచ మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించాడు. కోట్లరూపాయల ఐపీఎల్ కాంట్రాక్టును సైతం బెన్ స్టోక్స్ కాదనుకొని టెస్ట్ ఫార్మాట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. జట్టు ఎంపికలో తనను పరిగణించకూడదని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు. “క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా పూర్తి పాత్రను నెరవేర్చడానికి నా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను తిరిగి పెంచుకోవడంపై నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను” అని స్టోక్స్ తెలిపాడు. ఐపిఎల్, ప్రపంచ కప్ ఆడకపోవడంతో లభించే విరామం ఫిట్‌నెస్ సాధించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 17 సీజన్‌కు కూడా దూరంగా ఉన్నాడు. 2025 సీజన్లో ఇంగ్లండ్ 12 టెస్టుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ ను పూర్తి చేసి వెళ్లింది. మిగిలిన టెస్టుల్లో తాను పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా అందుబాటులో ఉండాలంటే టీ-20 ప్రపంచకప్ కు దూరంగా ఉండటం అనివార్యమని స్టోక్స్ వివరించాడు.
2022లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. 2023 ప్రపంచకప్ ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బెన్‌స్టోక్స్ కేవలం ఐదు ఓవర్లే బౌలింగ్ చేశాడు. టెస్టు సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 4న స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ చేరడంలో విఫలమైన ఇంగ్లండ్ ..ఆ లోటును టీ-20 ప్రపంచకప్ ద్వారా పూడ్చుకోవాలని భావిస్తోంది
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో తొలి మ్యాచ్ జూన్ 4న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో స్కాట్లాండ్‌తో ప్రారంభమవుతుంది. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుంది. కాగా, ఇంగ్లండ్ జట్టు సూపర్ 8, నాకౌట్‌లకు అర్హత సాధించడానికి ముందు బార్బడోస్, ఆంటిగ్వా, ఒమన్, నమీబియాతో గ్రూప్ మ్యాచ్‌లను ఆడుతుంది. 2024 టీ-20 ప్రపంచకప్ లో సైతం అత్యుత్తమంగా రాణించడం ద్వారా టైటిల్ నిలుపుకోవాలని కోరుకొంటున్నట్లు బెన్ ఓ ప్రకటన విడుదల చేశాడు.