Adrew Symonds Death: : క్రికెట్ లవర్స్‌కు మరో దుర్వార్త- ఆసిస్ క్రికెటర్ సైమండ్స్ కన్నుమూత
షేన్ వార్న మరణమే షాకింగ్‌గా ఉంది. ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియా క్రికెటర్ సైమండ్స్ లేడని తెలిసి యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి లోనవుతోంది.
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఆయనతో ఆడిన ఆటగాళ్లు ఆదివారం సంతాపం కూడా తెలియజేశారు. ఇటీవల షేన్ వార్న్, రాడ్ మార్ష్ మరణాలతో బాధపడుతున్న క్రీడాకారులకు ఇది నిజంగానే మరో విషాదకరమైన వార్త.
26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన 46 ఏళ్ల ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని టౌన్స్‌విల్లే బయట జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య విభాగం స్పాట్‌కు చేరుకొని ఆండ్రూ సైమండ్స్, అతని డ్రైవర్‌ను బతికించడానికి ప్రయత్నించింది. కారు రోడ్డుపై నుంచి వెళ్లి బోల్తా పడడంతో తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మరణించాడని పోలీసులు తెలిపారు.
అధికారులు సైమండ్స్ పేరు చెప్పలేదు, కానీ సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో మాత్రం చనిపోయింది సైమండ్స్ అని గుర్తించాయి. ఆయనతో గ్రౌండ్‌ను పంచుకున్న మిత్రులు కూడా సంతాప సందేశాలు పోస్టు చేశారు.
"ఇది చాలా భయంకరమైన వార్త" అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సైమండ్స్ సహచరుడు జాసన్ గిల్లెస్పీ ట్వీట్ చేశాడు. "నిజంగా ఇది గుండెల్నీ పిండేసే వార్త. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం మిత్రమా." అని ఆయన ట్వీట్ చేశాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన సోషల్ మీడియా పోస్టుపై ఇలా రాశాడు : "ఇది నిజంగా బాధిస్తుంది," అయితే పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ "చాలా బాధ పడ్డాను" అని చెప్పాడు. "తామంతా గ్రౌండ్‌లో& గ్రౌండ్ బయట చాలా గొప్ప రిలేషన్ కలిగి ఉన్నామని.. అతని ఫ్యామిలీకి ఆత్మస్థైర్యం దైవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియన్ క్రీడా దిగ్గజాలు షేన్ వార్న్, రాడ్ మార్ష్ మరణించిన కొద్ది నెలలకే సైమండ్స్ మరణం క్రికెట్ అభిమానులను కలచి వేస్తోంది. షేన్ వార్న్, రాడ్ మార్ష్ ఇద్దరు కూడా గుండెపోటుతో మరణించారు.
సైమండ్స్ ఆట పట్ల అతనికి ఉన్న దృక్పథం, ఆయన అంకిత భావం, వ్యక్తిత్వంతో బాగా ప్రాచుర్యం పొందారు. ఆస్ట్రేలియ క్రికెట్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్-రౌండర్లలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. 2003, 2007లో 50 ఓవర్ల ప్రపంచ కప్‌లను గెలిచిన జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు సైమండ్స్.
2008లో సైమండ్స్‌ను "మంకీగేట్" కుంభకోణం చేదు జ్ఞాపకంగా మిలిగిపోయింది. తీవ్ర వివాదాల్లోకి నెట్టింది. 2008లో సిడ్నీలో జరిగిన న్యూ ఇయర్ టెస్టులో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను "కోతి" అని పిలిచాడని సైమండ్స్ ఆరోపించాడు.
ఏ తప్పు చేయలేదని ఖండించిన హర్భజన్ సింగ్‌ను మూడు మ్యాచ్‌లకు సస్పెండ్ అయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్థాంతరంగా వెళ్లిపోతామని భారత్ బెదిరించడంతో నిషేధం రద్దు చేశారు.