IND vs AUS T20 series: భారత్‌తో టీ 20 సిరీస్ , జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
Australia squad for IND vs AUS T20I series: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ఆడనుంది.
![IND vs AUS T20 series: భారత్‌తో టీ 20 సిరీస్ , జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా Australia Announce 15 Player Squad For IND vs AUS T20I Series IND vs AUS T20 series: భారత్‌తో టీ 20 సిరీస్ , జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/29/c186dfbf8cea663440b487f8fa89f1fc1698550640118872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టీ 20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది. జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలకు స్థానం దక్కింది. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వరల్డ్‌కప్‌లో ఆడుతున్న కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ తర్వాత వీరు స్వదేశం తిరిగి వెళ్లనున్నారు.
టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.
ఇటు ప్రపంచకప్‌లో ఆస్ర్టేలియా వరుస విజయాలతో మళ్లీ గాడినపడింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి బాల్ వరకు పోరాడింది. కానీ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టాల్సిన పరిస్థితిలో కొత్త బ్యాటర్ ఫెర్గుసన్ డాట్ బాల్ ఆడటంతో న్యూజిలాండ్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓడి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఆది నుంచి ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించగా... డేవిడ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ కూడా విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ 67 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లోనే 5 ఫోర్లు ఆరు సిక్సర్లతో 81 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. హెడ్, వార్నర్ జోడి 19.1 ఓవర్లలోనే 175 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా భారీ స్కోరుకు పునాది వేశారు. వీరిద్దరూ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా పరుగుల వేగం తగ్గింది. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ 24 బంతుల్లో 41 పరుగులు, ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లోనే 37 పరుగులు చేసి జట్టు స్కోరును 388 పరుగులకు చేర్చారు. ఓ దశలో తేలిగ్గా నాలుగు వందలు పరుగులు చేసేలా కనిపించిన ఆస్ట్రేలియా 388 పరుగులకే పరిమితమైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)