అన్వేషించండి
AUS vs ENG: ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఆపగలదా, యాషెస్ ప్రత్యర్థుల మధ్య రసవత్తర పోరు!
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్ ఆశలు కోల్పోయిన ఇంగ్లండ్... కంగారులపై గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారో.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ పోరు కోసం అంతే ఎదురుచూస్తారు. అది ప్రపంచకప్ లాంటి మహా సంగ్రామంలో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇప్పడు ఈ మహా పోరులో ఆసిస్- బ్రిటీష్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే సెమీస్ ఆశలు కోల్పోయిన ఇంగ్లండ్... కంగారులపై గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇటు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు మరింత చేరువ కావాలని చూస్తోంది. ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కంగారులు...ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి సెమీస్ రేసులో నిలిచారు. ఇంగ్లండ్ మాత్రం వరుసగా నాలుగు పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆస్ర్టేలియా మూడో స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ అట్టడుగున ఉంది. పాయింట్లు, సెమీస్ ఆశలు ఇవన్నీ పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
విధ్వంసం సృష్టిస్తున్న ఆసిస్ బ్యాటింగ్
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ రెండు సెంచరీలు చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ విశ్వ సమరంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అయిదు సెంచరీలు నమోదు చేయగా అందులో రెండు వార్నరే చేశాడు. ఈ మెగా టోర్నీలో 413 పరుగులతో వార్నర్ టాప్ 5 జాబితాలో ఉన్నాడు. కానీ ఇద్దరు కీలక ఆటగాళ్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్
ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆస్ట్రేలియాను కలవరపరుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల మార్ష్ ఇంటికి తిరిగి వెళ్లగా గోల్ఫ్ కార్ట్ వెనుక నుంచి కిందపడిన మాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో మార్ష్ మెరుపులు మెరిపించిగా... మాక్స్‌వెల్ ప్రపంచ కప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ దూరమవ్వడం కంగారులకు పెద్ద ఎదురు దెబ్బే. వీరిద్దరి స్థానంలో కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించడం ఆసిస్‌కు ఉపశమనం కల్గిస్తోంది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కూడా రాణిస్తే ఇంగ్లండ్‌కు మరో ఓటమి తప్పకపోవచ్చు.
స్టోయినిస్, గ్రీన్ కూడా భారీ స్కోరుపై కన్నేసి తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్నారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ మరియు పాట్ కమ్మిన్స్‌తో కంగారు పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండగా ఆడమ్ జంపా ఈ ప్రపంచకప్‌లో అంచనాలను మించి రాణిస్తున్నాడు.
ఇంగ్లండ్ కథ వేరు
చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై విజయం సాధించి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. కానీ బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతుడడం బ్రిటీష్ జట్టును కలవరపరుస్తోంది. చివరి మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ 170 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. ఈ బలహీనతను అధిగమించి ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. గాయపడిన రీస్ టోప్లీ స్థానంలో బ్రైడాన్ కార్సే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌కు గెలుపు తప్పనిసరి. ప్రపంచ కప్‌లో మొదటి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకూ ఇరు జట్లు 155 వన్డేల్లో తలపడగా 87 సార్లు ఇంగ్లండ్ ఓడిపోయింది. డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ రాణించాలని బ్రిటీష్ జట్టు కోరుకుంటోంది.
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion