(Source: ECI/ABP News/ABP Majha)
AUS vs AFG: ఆ ఒక్క క్యాచ్ ఎంత పని చేసింది, ముజీబ్ జారవిడిచింది మ్యాచ్‌ను
ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను జారవిడవడమే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు.
Glenn Maxwell: 1999 ప్రపంచకప్(World Cup 1999)లో దక్షిణాఫ్రికా భీకర ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో అప్పటికే సెమీస్ చేరింది. కానీ ఆస్ట్రేలియా(Australia) పరిస్థితి వేరు. 1999 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే ఆసిస్... కచ్చితంగా దక్షిణాఫ్రికాపై గెలవాల్సిందే. అలాంటి మ్యాచ్‌లో ప్రొటీస్ విజయం దిశగా పయనిస్తోంది. కానీ సారథి స్టీవ్ వా(Steve Waugh) ఒక్కడే పోరాడుతున్నాడు. ఈ క్రమంలో స్టీవ్ వా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను హెర్షల్ గిబ్స్(Herschelle Gibbs) అందుకున్నాడు. కానీ అత్యుత్సాహంతో దానిని పైకి విసరాలన్న సంతోషంలో నేలపాలుజేశాడు. అనంతరం స్టీవ్ వా అద్భుత శతకంతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. అనంతరం ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్‌లో అలెన్ డొనాల్డ్( Allen donald) రనౌట్ అవ్వడంతో కంగారులు ఫైనల్ చేరి కప్పును కూడా ఎగరేసుకుపోయారు. గిబ్స్ ఆ క్యాచ్ మిస్ చేసినప్పుడు స్టివ్ వా... నువ్వు మిస్ చేసేంది క్యాచ్ కాదు.. ప్రపంచకప్ అని అన్నాడని కూడా వార్తలు చెలరేగాయి. అది నిజమైనా కాకపోయినా క్యాచ్‌కు అంత విలువుంటుంది మదీ.
ఇప్పుడు అఫ్గానిస్తాన్(Afghan cricketer) సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాపై విజయం తప్పనిసరి. దానికి తగ్గట్లే ఆస్ట్రేలియా పరాజయం దిశగా నడుస్తోంది కూడా. గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell) 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు మ్యాక్స్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను ముజీబ్ (Mujeeb Ur Rahman) నేలపాలు చేశాడు. అప్పుడు ముజీబ్ నేలపాలు చేసింది క్యాచ్‌ను కాదు. అఫ్గాన్ గెలవాల్సిన మ్యాచ్‌ను. అంతే వచ్చిన లైఫ్‌తో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అఫ్గాన్ బౌలర్లను ఒంటి చేత్తో ఊచకోత కోశాడు. అసలు ఆస్ట్రేలియా కూడా ఊహించని విజయాన్ని మ్యాక్స్‌వెల్ ఆ జట్టుకు అందించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో మ్యాక్సీ అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ చేసిన 201 పరుగుల్లో 144 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.
మ్యాచ్ అనంతరం మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను జారవిడవడమే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (Hashmatullah Shahidi)తెలిపాడు. క్యాచ్‌ను జారవిడిచినప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 33 పరుగుల వద్దే ఉన్నాడని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ మమ్మల్ని చాలా నిరాశపరిచిందన్న షాహిదీ.. ఈ ఓటమి మాకు నమ్మశక్యం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము గెలుపొందే దశలో ఉన్న సమయంలో ఈ ఓటమి ఎదురైందని షాహిదీ వాపోయాడు. తమ బౌలర్లు మంచి ఆరంభాన్నిచ్చారని, కానీ మేం వదులుకున్న అవకాశాలు మమ్మల్ని బాధించాయని షాహీదీ తెలిపాడు. తాము జారవిడిచిన క్యాచ్ అనంతరం మ్యాక్స్‌వెల్ ఇక ఆగలేదని వెల్లడించాడు. ఆ క్యాచ్‌ను జారవిడవడమే టర్నింగ్ పాయింట్ అని తాను భావిస్తున్నట్లు అఫ్గాన్ కెప్టెన్ తెలిపాడు. మ్యాక్స్‌వెల్ అద్భుతంగా ఆడాడని, అన్ని రకాల షాట్‌లు ఆడాడని... క్యాచ్ జారవిడిచాక తమ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని షాహిదీ అన్నాడు. కానీ జట్టు ప్రదర్శనపై షాహిదీ ప్రశంసలు కురిపించాడు. తమ బౌలర్లను చూసి గర్విస్తున్నట్లు వెల్లడించారు. గెలుపు ఓటములు ఆటలో భాగమని షాహిదీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో పూర్తి బలంతో బరిలోకి దిగి విజయం సాధిస్తామని వెల్లడించారు. ఇబ్రహీం జద్రాన్ సెంచరీని మర్చిపోవద్దని.. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడు అతడేనని షాహిదీ గుర్తు చేశాడు.