Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం లభించింది. టీ20 క్రికెట్లో అమ్మాయిల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించింది.
Asian Games 2023:
ఆసియా క్రీడలు - 2023లో భారత్‌కు మరో పతకం లభించింది. టీ20 క్రికెట్లో అమ్మాయిల జట్టు స్వర్ణ పతకం సాధించింది. క్రికెట్ కప్‌ను సగర్వంగా అందుకుంది. హాంగ్జౌ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించింది. 117 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 97/8కి కట్టడి చేసింది. లంకలో హాసిని పెరీరా (25), నీలాక్షి డిసిల్వా (23) టాప్ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో ఓపెనర్ స్మృతి మంధాన (46; 45 బంతుల్లో 4x4, 1x6), జెమామీ రోడ్రిగ్స్ (42; 40 బంతుల్లో 5x4) విలువైన ఇన్నింగ్సులు ఆడారు.
మంధాన.. జెమీమా అదుర్స్
పాత పిచ్‌ల పైనే ఆడించడం.. అవి మరీ మందకొడిగా ఉండటంతో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. అసలే వికెట్లు స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో తెలివిగా బ్యాటింగ్ చేసింది. జట్టు స్కోరు 16 వద్దే ఓపెనర్ షెఫాలీ వర్మ (9) స్టంపౌట్ అయింది. దాంతో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి స్మృతి మంధాన జట్టుకు మంచి స్కోరు అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 67 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనవసర షాట్లు ఆడలేదు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించారు. ఉద్దేశపూర్వకంగా దూకుడు పెంచలేదు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన స్మృతిని జట్టు స్కోరు 89 వద్ద రణవీర ఔట్ చేసింది. మరికాసేపటికే జెమీమా అద్భుత ఇన్నింగ్స్‌కు ప్రబోధిని తెరదించింది. ఆ తర్వాత ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడంతో టీమ్‌ఇండియా 116/7కు పరిమితమైంది.
ఆఖరి వరకు థ్రిల్లింగ్
ఛేదనకు దిగిన శ్రీలంకకు శుభారంభమమేమీ దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్ అనుష్క సంజీవని (1), వన్‌డౌన్లో వచ్చిన విష్మీ గుణరత్నె (0)ను టిటాస్ సాధు ఔట్ చేసింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన చమరీ ఆటపట్టు (12)నూ ఆమే క్లీన్‌బౌల్డ్ చేసింది. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకకు హాసినీ పెరీరా, నీలాక్షి ప్రాణం పోశారు. బంతుల్ని డిఫెండ్ చేస్తూ వికెట్లు కాపాడుకున్నారు. ఒక్కో పరుగు చేస్తూ జట్టును పోటీలో ఉంచారు. నాలుగో వికెట్‌కు 33 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. పదో ఓవర్ ఆఖరి బంతికి హాసినిని గైక్వాడ్ ఔట్ చేసినా.. ఓషది రణసింఘెతో కలిసి నీలాక్షి 28 (38) పరుగుల భాగస్వామ్యం అందించింది. వీరిద్దరూ ఔటవ్వడంతో లంక రన్‌రేట్ తగ్గింది. ఆఖర్లో టెయిలెండర్లు దూకుడుగా ఆడబోయి వికెట్లు ఇవ్వడంతో టీమ్‌ఇండియా గెలిచేసింది.