
Asia Cup 2023: టీమ్‌ఇండియాకు అన్నీ ఎక్కువే.. అదే అసలు సమస్య! దాదా కామెంట్స్!
Asia Cup 2023: టీమ్‌ఇండియాలో నాలుగో పొజిషన్‌పై అతిగా ఆలోచించొద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు.

Asia Cup 2023:
టీమ్‌ఇండియాలో నాలుగో పొజిషన్‌పై అతిగా ఆలోచించొద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు. ఆ స్థానంలో ఆడేందుకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరు ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేయాలన్న దానిపై ఎలాంటి నిబంధనలు లేవన్నాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని సూచించాడు. భారత్‌లో ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నారని, అదే పెద్ద సమస్యని వెల్లడించాడు.
ఆసియా కప్ 2023కి 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌కు చోటిచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ మెగా టోర్నీకి ఎంపికయ్యారు. హైదరాబాదీ తిలక్ వర్మకూ సెలక్టర్లు అవకాశం ఇవ్వడం గమనార్హం.
'నాలుగో స్థానం అనేది ఒక నంబర్ మాత్రమే. ఎవరైనా అక్కడ ఆడగలరు. ఎవరూ ఓపెనర్, నంబర్ త్రీ, నంబర్ ఫోర్‌గా పుట్టరు. వన్డేల్లో మొదట నేను మిడిలార్డర్లో ఆడాను. కెప్టెన్ అడగడంతో సచిన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాను. అతడూ ఆరో స్థానంలో ఆడేవాడు. ఓపెనర్‌గా వచ్చాక దిగ్గజంగా మారిపోయాడు. అందుకే ఎవరైనా నంబర్ ఫోర్‌లో ఆడగలరు. ఇందుకు విరాట్ కోహ్లీ, శ్రేయస్, రాహుల్ ఉన్నారు. టీమ్‌ఇండియాలో చాలా ప్రతిభ ఉంది' అని గంగూలీ అన్నాడు.
'మనకు ఇది లేదు. మనకు అది లేదు అని చాలా మంది నాతో చెప్తున్నారు. నిజానికి మనకు అన్నీ ఎక్కువే. అదే మన సమస్య. ద్రవిడ్, రోహిత్, సెలక్టర్లు కలిసి ఒకరికి నాలుగో స్థానం అప్పగించండి. ప్రపంచకప్ మొత్తం అతడినే ఆడించండి. నేనిచ్చే సలహా ఇదొక్కటే. ఒక్క బ్యాటింగ్ పొజిషన్ వల్ల గొప్ప తేడా ఏమీ ఉండదు. కేవలం నాలుగో పొజిషన్‌తో ప్రపంచకప్ గెలవలేరు. కలిసి నిర్ణయించి బాధ్యతను ఒక్కరికి అప్పగిస్తే చాలు' అని దాదా అన్నాడు.
ఐర్లాండ్ సిరీసులో జస్ప్రీత్ బుమ్రా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని గంగూలీ తెలిపాడు. అతడి ఉనికి ప్రత్యర్థుల వ్యూహాల్లో కచ్చితంగా మార్పులు తీసుకొస్తుందన్నాడు. 'సుదీర్ఘ కాలం తర్వాత బుమ్రా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అతడు తేలికగానే కనిపిస్తున్నాడు. ఆసియాకప్‌లో ఎలా ఆడతాడో చూడాలి. చాలా వేగంగా బంతులు వేస్తున్నాడు. అతడి బంతులు బ్యాటును గట్టిగా తాకుతున్నాయని నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన బ్యాటర్లు అంటున్నారు. ఐర్లాండ్‌లో అతడి బౌలింగ్‌ను పరిశీలించాను. వేగం ఉంది' అని దాదా అన్నాడు.
హిట్‌మ్యాన్ సేనపై తనకు అపారమైన నమ్మకం ఉందని గంగూలీ అంటున్నాడు. 'వాళ్లు చాలాసార్లు సెమీస్‌కు వెళ్లారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రెండుసార్లు ఆడారు. ఒక్కసారి లయ అందుకున్నారంటే దానినీ దాటగలరు. ఈ జట్టుపై నాకు నమ్మకం ఉంది. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్, ప్రపంచకప్‌ను ఈ ఆటగాళ్లే ఆడాలని కోరుకుంటున్నా. అందరూ మంచి ఫామ్‌లో ఉండటం అవసరం. ఒక బ్యాటింగ్ పొజిషన్, ఒక ఆటగాడే ప్రపంచకప్ గెలిపించలేరు' అని దాదా స్పష్టం చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ
రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
