Asia Cup 2023 Prize Money: గెలిస్తే వచ్చేదెంత? - ఓడితే పోయేదెంత? - ఆసియా కప్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే!
భారత్ - శ్రీలంకల మధ్య నేడు జరుగబోయే ఆసియా కప్ - 2023 ఫైనల్‌లో గెలిచి, ఓడిన జట్లకు ప్రైజ్ మనీ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
Asia Cup 2023 Prize Money: ఏకపక్ష మ్యాచ్‌లు, థ్రిల్లింగ్ విక్టరీలు, ఆటకు అంతరాయం కలిగిస్తూ పదే పదే ఆటగాళ్లు, అభిమానులతో దోబూచులాడుతున్న వర్షాల మధ్య ఆసియా కప్ తుది ఘట్టానికి చేరింది. ఆదివారం భారత్ - శ్రీలంకల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేతకు, రన్నరప్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంత..? ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వాటిని ఎలా పంచనుంది..?
గెలిస్తే ఎంత..?
ఆసియా కప్ ఫైనల్‌లో గెలిచిన జట్టుకు 2 లక్షల యూఎస్ డాలర్లు దక్కుతాయి. అంటే భారత కరెన్సీలో సుమారు ఒక కోటి 66 లక్షల రూపాయలు.
ఓడితే ఎంత..?
ఫైనల్‌లో ఓడిన జట్టుకు వచ్చే ప్రైజ్ మనీ విజేత టీమ్‌లో సగం దక్కనుంది. రన్నరప్‌కు లక్ష యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. అంటే ఆసియా కప్ రన్నరప్‌కు దక్కే నగదు విలువ సుమారు రూ. 83 లక్షలు. ఓడిన జట్టు తమకు వచ్చిన అమౌంట్‌తో రెట్టింపు నగదును కోల్పోనుంది.
The Iconic Asia Cup Trophy in Colombo! 😍#AsiaCup2023 pic.twitter.com/qA8tjEVz9w
— AsianCricketCouncil (@ACCMedia1) September 16, 2023
సెమీఫైనలిస్టులు (సూపర్ - 4కు వచ్చిన జట్లు) తలా రూ. 51 లక్షలు దక్కించుకుంటాయి. ఐదు, ఆరో స్థానంలో ఉన్న జట్లకు రూ. 25 లక్షలు, రూ. 10 లక్షలు దక్కుతాయి.
ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఆటగాడికి ఐదు వేల యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ.. (భారత కరెన్సీలో రూ. 4 లక్షలు) దక్కనుంది. మొత్తంగా ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణకు ఏసీసీ నాలుగు మిలియన్ల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 32 కోట్లు) కేటాయించింది. టోర్నీ ముగిశాక నగదు ఆరు జట్లకూ పంచనుంది.
2022లో ఆసియా కప్ గెలిచిన శ్రీలంకకు రూ. 1.59 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు రూ. 80 లక్షలు దక్కాయి.
గతనెల 31న మొదలైన ఆసియా కప్ - 2023లో ఆరు దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. చరిత్రలో తొలిసారిగా రెండు దేశాలలో ఆడిన ఆసియా కప్‌లో భాగంగా పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్ - ఎలో పాకిస్తాన్, నేపాల్, భారత్ ఉండగా గ్రూప్ - బి నుంచి శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. వీటిలో గ్రూప్ - ఎ నుంచి భారత్, పాక్.. గ్రూప్ - బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకలు సూపర్ - 4 కుఅర్హత సాధించాయి. సూపర్ - 4లో భారత్, శ్రీలంకలు టాప్ -2లో నిలిచి ఫైనల్‌కు చేరాయి. ఆదివారం భారత్ - శ్రీలంక మధ్య ఫైనల్ జరుగనుంది.
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్:
- కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆడే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.
లైవ్ చూడండిలా..
- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో అయితే స్టార్ నెట్‌వర్క్స్ ఛానెల్స్‌లో చూడొచ్చు. ఇక మొబైల్ యాప్, వెబ్‌సైట్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్ నుంచి ఉచితంగా వీక్షించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial