Asia Cup, IND vs PAK: ప్రేమదాసలో చేదువార్త! భారత్ vs పాక్ సూపర్ 4 మ్యాచుకు వానగండం!
Asia Cup, IND vs PAK: క్రికెట్ అభిమానులకు చేదువార్త! దాయాదుల సమరాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్న వారి ఆశలు అడియాసలే కానున్నాయి.
Asia Cup, IND vs PAK:
క్రికెట్ అభిమానులకు చేదువార్త! దాయాదుల సమరాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్న వారి ఆశలు అడియాసలే కానున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ థ్రిల్లర్‌ను కన్నులారా వీక్షించే అవకాశం కనిపించడం లేదు. భారత్, పాక్ సూపర్ 4 మ్యాచుకు వానగండం పొంచివుంది. వరుణదేవుడు అభిమానులను ఏమాత్రం కనికరించేలా లేడు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
ఆసియాకప్-2023లో లీగ్ దశ ముగిసింది. బుధవారం నుంచి సూపర్ -4 మ్యాచులు మొదలయ్యాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇందుకు అర్హత సాధించాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ సెప్టెంబర్ 10, ఆదివారం జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఆదివారం దాయాదుల సమరానికి వాతావరణం అనుకూలంగా లేదు. కొలంబోలో ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంటోంది. ఉదయం వాన పడేందుకు 70 శాతం అవకాశం ఉందట. రోజు గడిచే కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. వర్షం కురిసే అవకాశాలు ఇంకా పెరుగుతాయట. మ్యాచ్ ఆరంభమయ్యే మధ్యాహ్నం 3 గంటలకు ఆటగాళ్ల బదులు వరుణుడు నేరుగా బ్యాటింగ్‌కు దిగుతాడట. సాయంత్రం కారు మబ్బులతో వాతావరణం ఇంకా చల్లబడనుందని తెలిసింది. ఫ్లడ్‌లైట్ వెలుతురులోనూ మ్యాచ్ సవ్యంగా సాగుతుందన్న నమ్మకం కనిపించడం లేదు.
వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల సూపర్ 4 ఆఖరి దశను ప్రేమదాస నుంచి హంబన్‌తోటకు మార్చాలని అనుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో సభ్య దేశాలు అంగీకరించకపోవడంతో మళ్లీ యథాప్రకారమే జరుగుతున్నాయి. ఆసియాకప్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మొదటి మ్యాచుకూ వరుణుడు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా 48.5 ఓవర్లకు 266 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత పాక్ ఛేదన ఎలా ఉంటుందో చూడాలని చాలామంది అనుకున్నారు. కానీ నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేశారు. భారత్, నేపాల్ మ్యాచుకూ వరుణుడు అంతరాయం కలిగించాడు. కానీ కాస్త తెరపినివ్వడంతో పోటీ పూర్తిగా కొనసాగింది.
Asia Cup 2023: ఆసియా కప్ - 2023 ఆతిథ్య హక్కులు కలిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లను బోనులో నిలబెట్టేందుకు మరోసారి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏసీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ.. లంకలో వర్షం వల్ల నష్టపోయిన మ్యాచ్‌ల ఆదాయాన్ని తమకు నష్టపరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నది. పల్లెకెలె (క్యాండీ)లోని భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం కాగా భారత్ - నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా ఓవర్లు కుదించాల్సి వచ్చింది. తాజాగా పీసీబీ చీఫ్ జకా అష్రఫ్.. తమకు నష్టపరిహారం అందించాలని ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లేఖ రాసినట్టు తెలుస్తున్నది.
శ్రీలంకలో వర్షాల కారణంగా మ్యాచ్‌లలో అమ్ముడుపోని టికెట్లకు తమకు నష్టపరిహారం కావాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. దీనిపై పీసీబీ అధికారికంగా ఏ ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ పాకిస్తాన్‌కు చెందిన పలు టీవీ ఛానెళ్లు, వెబ్‌సైట్లు అష్రఫ్.. జై షాకు లేఖ రాసినట్టు కథనాలు వెలువరించాయి.