Perni Nani Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Andhra Pradesh News | ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Andhra Pradesh Ration Rice Case | విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన గోడౌన్ లో బియ్యం మాయం కేసులో స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావు నిందితులుగా ఉన్నారు. వీరిని పోలీసులు సోమవారం రాత్రి 11గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు బ ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలపై సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2గా బ్యాంక్ ఎకౌంట్ నగదు లావాదేవీల ఆధారంగా రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ మిల్లర్ బ్యాంక్ ఖాతా నుండి A2 మానస తేజ బ్యాంక్ ఎకౌంట్‌కు రూ. 24 లక్షలు బదిలీ అయినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రైస్ మిల్లర్ బ్యాంక్ అకౌంట్ నుంచి లారీ డ్రైవర్ ఖాతాలకు రూ.16 లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు.