Asia Cup 2023: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి - భారత వరల్డ్ కప్ సన్నాహకాలకు షాకిస్తున్న వరుణుడు - ఇండోర్ ప్రాక్టీస్‌కు కెప్టెన్ డుమ్మా
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టుగా ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. ప్రపంచకప్ సన్నాహకాలు కాస్తా వర్షార్పణమవుతున్నాయి.
Asia Cup 2023: ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లినా టీమిండియా అసలు లక్ష్యం వన్డే వరల్డ్ కప్ అనేది బహిరంగ రహస్యమే. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరుగుతన్న ఈ టోర్నీని మెగా టోర్నీకి సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న భారత జట్టుకు వరుణుడు షాకుల మీద షాకులిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లేది లేదని, యూఏఈలో ఆడమంటే ఎండలు బాగా కొడితే ఆటగాళ్లు అలిసిపోతారని సాకులు చెప్పి లంకలో మ్యాచ్‌ల నిర్వహణకు మొగ్గుచూపిన బీసీసీఐ.. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టుగా అయింది పరిస్థితి. ప్రపంచకప్ సన్నాహకాల సంగతి పక్కనెడితే మనోళ్లు లంకలో వర్షాలు చూసేందుకే అక్కడికి వెళ్లినట్టైంది.
సన్నాహకం వర్షార్పణం..
అక్టోబర్‌లో భారత్ వేదికగా మొదలుకాబోయే వన్డే ప్రపంచకప్‌కు ఆసియా కప్‌ను సన్నాహకంగా వాడుకోవాలని ఈ టోర్నీలో పాల్గొనే భారత్‌తో పాటు మిగిలిన జట్లు అనుకున్నాయి. అయితే భారత్ సంగతి కాసేపు పక్కనెడితే మిగిలిన జట్లు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడాయి. అక్కడ వర్షాలు లేవు. ఎండలు దంచికొడుతున్నాయి. మ్యాచ్‌లు సజావుగా సాగడంతో ఫలితాలు రావడమే గాక ఆటగాళ్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు తమ లోపాలు, బలాలను అంచనా వేసుకున్నాయి.కానీ భారత్ పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. పల్లెకెలె (క్యాండీ)లో రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఒక్కటి కూడా పూర్తిగా ఆడలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షార్పణం కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో ఓవర్లు కుదించాల్సి వచ్చింది.
పాక్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లోపాలు సుస్పష్టమయ్యాయి. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లి, గిల్, శ్రేయాస్‌లు అట్టర్ ప్లాఫ్ అయ్యారు. ఇషాన్, హార్ధిక్‌ల భాగస్వామ్యంతో గట్టెక్కిన భారత్.. నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు రాణించడంతో ఊపిరిపీల్చుకుంది. ఇక పసికూన నేపాల్‌తో మ్యాచ్‌లో మన బౌలర్లు అంత గొప్పగా రాణించింది లేదు. షమీ, సిరాజ్, జడేజా, కుల్దీప్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లను ధీటుగా ఎదుర్కున్న నేపాల్.. 230 పరుగులు చేసింది. ఈ బౌలింగ్ యూనిట్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గనక బౌలింగ్ చేసుంటే పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉండేదోనని మొన్నటి మ్యాచ్ ముగిశాక భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
వాళ్ల పరిస్థితి మరీ దారుణం..
గతేడాది ఆగస్టు తర్వాత వన్డే ఆడని బుమ్రా.. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. నేపాల్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు. శస్త్ర చికిత్సలు చేయించుకుని తిరిగొచ్చిన బుమ్రా, కెఎల్ రాహుల్, అయ్యర్‌లకు ఆసియా కప్ మంచి సన్నాహకంగా ఉంటుందని ఆశించినా అది కూడా జరగలేదు.
కొలంబో కష్టమే..
గ్రూప్ స్టేజ్ పోతే పోయింది సూపర్ - 4లో అయినా భారత జట్టుకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని ఆశిస్తున్న అభిమానులకు వరుణుడు ‘మీరు మరీ ఎక్కువగా ఆశించకండి బ్రో.. నేను రెడీగా ఉన్నా’ అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పల్లెకెలెలో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా కొలంబోలో అయినా మ్యాచ్‌లు సజావుగా సాగే అవకాశమైతే లేదు. లంక రాజధానిలో ప్రస్తుతం వానలు దంచికొడుతున్నాయి. సూపర్-4 తో పాటు ఫైనల్ జరుగబోయే ఇక్కడ జరిగే ఫైనల్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. రాబోయే పదిరోజుల్లో అక్కడ వర్షం కురిసే అవకాశాలు 50 నుంచి 70 శాతం దాకా ఉన్నాయి. సెప్టెంబర్ 10న జరుగబోయే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశాలు 75 శాతానికి ఎక్కువేనట.
ఇండోర్ ప్రాక్టీస్..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తదుపరి మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఆదివారం నాటి భారత్ - పాక్ మ్యాచ్‌కు ప్రాక్టీస్ చేయడానికి కూడా వర్షం ఛాన్స్ ఇవ్వలేదు. కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్‌లో నీళ్లు నిలవడంతో భారత ఆటగాళ్లు ఇండోర్ ప్రాక్టీస్‌తో ముగించారు. ఈ ప్రాక్టీస్‌కూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డుమ్మాలు కొట్టారు.
#TeamIndia had an indoor nets session at the NCC in Colombo today. 📸 #AsiaCup2023 pic.twitter.com/UhkB64L2Wp
— BCCI (@BCCI) September 7, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial