IND vs HKG: దడ.. దడే! 259 కొట్టిన హాంకాంగ్! టీమ్‌ఇండియాకు వణుకు!
India vs Hong kong: హాంకాంగ్ పేరు వినిపిస్తే మీకేం గుర్తొస్తుంది! జస్ట్ పసికూన! అంతే కదా! 2018 ఆసియా కప్‌లోనూ టీమ్‌ఇండియా ఇలాగే అనుకుంది. అలాంటి జట్టుకు ఓటమి భయాన్నిరుచి చూపించింది హాంకాంగ్.
India vs Hong kong: అంతర్జాతీయ క్రికెట్లో హాంకాంగ్ పేరు వినిపిస్తే మీకేం గుర్తొస్తుంది! జస్ట్ పసికూన! అంతే కదా! 2018 ఆసియా కప్‌లోనూ టీమ్‌ఇండియా ఇలాగే అనుకుంది. చిటికెలో ఓడించేస్తామని ఫీలైంది. తమ బౌలర్లకు తిరుగులేదని భావించింది. ప్రత్యర్థిని 20 ఓవర్లకే ప్యాక్ చేద్దామని అనుకుంది. అలాంటి జట్టుకు ఓటమి భయాన్ని రుచి చూపించింది హాంకాంగ్. కఠినమైన పిచ్‌పై హిట్‌మ్యాన్ సేన నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని దాదాపుగా ఛేదించినంత పనిచేసింది.
గబ్బర్ సెంచరీ
గత ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో జరిగింది. టోర్నీలో నాలుగో మ్యాచులో టీమ్‌ఇండియా, హాంకాంగ్ తలపడ్డాయి. 2018, సెప్టెంబర్ 18న ఈ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (23) త్వరగానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (127; 120 బంతుల్లో 15x4, 2x6) అద్వితీయ శతకం బాదేశాడు. అతడికి తోడుగా అంబటి రాయుడు (60; 70 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
వీరంతా ఔటయ్యాకే అసలు కథ మొదలైంది. 9 ఓవర్లు వేసిన కించిత్ షా 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గబ్బర్, భువీ, డీకేను ఔట్ చేశాడు. విచిత్రంగా ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. డీకే (33), కేదార్ జాదవ్ (28*) కాస్త ఫర్వాలేదనిపించారు.
34 ఓవర్ల వరకు నో వికెట్
కఠినమైన పిచ్.. ఎదురుగా కొండంత లక్ష్యం.. తిరుగులేని బౌలర్లు ఉండటంతో హాంకాంగ్ ఘోర పరాజయం పాలవుతుందని అంతా ఊహించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. తాము పసికూనలం కాదు కసి కూనలం అని హాంకాంగ్ చాటి చెప్పింది. ఓపెనర్లు నిజాఖత్ ఖాన్ (92; 115 బంతుల్లో 12x4, 1x6), ఆన్షీ రాఠ్ (73; 97 బంతుల్లో 4x4, 1x6) టీమ్‌ఇండియాకు చుక్కలు చూపించారు. 34 ఓవర్ల పాటు వికెట్టే ఇవ్వలేదు. తొలి వికెట్‌కు 174 పరుగులు భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించారు.
వీరిద్దరి దెబ్బకు శార్దూల్ ఠాకూరైతే పది బంతుల ఓవర్ విసరాల్సి వచ్చింది. అందులో మూడు ఫ్రీ హిట్లు వచ్చాయి. భువీదీ ఇలాంటి పరిస్థితే. అయితే 174 వద్ద రాఠ్‌ను కుల్‌దీప్, 175 వద్ద నిజాకత్‌ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయడంతో కాస్త ఊరట లభించింది. యుజ్వేంద్ర చాహల్ (3), ఖలీల్ అహ్మద్ (3), కుల్‌దీప్ యాదవ్ (2) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ ఎహ్‌సన్ ఖాన్ (22), కించిత్ షా (17), తన్వీర్ అఫ్జల్ (12) పోరాడిన తీరు ఆకట్టుకుంది. హాంకాంగ్ 259/8కి పరిమితమైంది. ఖలీల్ అహ్మద్‌కు ఇది అరంగేట్రం మ్యాచ్ కావడం ప్రత్యేకం.
ప్రస్తుతం ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. ఆగస్టు 31న భారత్, హాంకాంగ్ దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. మరోసారీ పసికూనల నుంచి క్రికెట్ ప్రేమికులు ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు. అలాగే హిట్‌మ్యాన్ సేన ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని కోరుతున్నారు.