Ravichandran Ashwin: టీమిండియాకు బిగ్ షాక్ - మూడో టెస్ట్ నుంచి వైదొలిగిన అశ్విన్
India vs England: తల్లి అనారోగ్యం కారణంగా స్టార్ స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
Ashwin withdraws from Rajkot Test : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా(Team India)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్ స్పిన్నర్ అశ్విన్... మ్యాచ్ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు అశ్విన్ చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ట్వీట్ చేశారు. అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానట్లు శుక్లా ట్వీట్ చేశారు.
అశ్విన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించిన బీసీసీఐ... ఆటగాళ్ళ సంబంధికుల ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమైనదని ట్వీట్‌లో పేర్కొంది. మిగిలిన రెండు టెస్టులకు కూడా అశ్విన్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అశ్విన్ స్థానంలో పుల్కిత్ నారంగ్, జయంత్ యాదవ్, జలజ్ సక్సేనాలలో ఒకరికి స్థానం దక్కవచ్చని ప్రచారం జరగుతోంది.
అశ్విన్ కొత్త చరిత్ర
భారత్(India), ఇంగ్లాండ్(England) మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టిస్తున్నాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.
అగ్ర స్థానంలో మురళీధరన్
ఈ జాబితాలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్ కేవలం 87 టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. భారత్ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్ నిలిచాడు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆటగాడిగా అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో 5 వికెట్లు ప్రదర్శన 34 సార్లు నమోదు చేశాడు. ఇప్పటికే వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచులో అశ్విన్(Ravichandran Ashwin )రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు పడగొట్టగా ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై ఇప్పటి వరకు ఏ టీమ్ఇండియా బౌలర్ కూడా వంద వికెట్లు తీయలేదు. అశ్విన్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై 98 వికెట్లు తీశాడు. అతడు మరో 2 వికెట్లు గనుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జేమ్స్ అండర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు.