India vs Australia: నయా ఫినిషర్ నుంచి నేర్చుకుంటున్నా, శిష్యుడిగా మారిపోయిన తిలక్ వర్మ
Tilak Varma : ఆట ఆఖరి ఓవర్లలో ఎలా ఆడాలో రింకూ నుంచి నేర్చుకుంటున్నాని... జాతీయ జట్టు కోసం నిలకడైన ప్రదర్శనే చేయడమే తన లక్ష్యమని హైదరాబాదీ తిలక్ వర్మ తెలిపాడు.
రింకూ సింగ్ (Rinku Singh) టీమిండియా(Team India) నయా ఫినిషర్‌గా మారుతున్నాడు. ఐపీఎల్(IPL)లో అయిదు బంతులకు అయిదు సిక్సులు కొట్టిన దగ్గరినుంచి రింకూ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసకర బ్యాటర్‌గా రాణిస్తున్న రింకూ సింగ్.. తాజాగా ఆస్ట్రేలియా(Australia) తో జరిగిన తొలి టీ 20 (T20)మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సు కొట్టి టీమిండియాకు విజయం అందించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి 14 బంతుల్లోనే నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు చేసిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆఖరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా.. రింకూ సిక్సర్ కొట్టాడు. బౌలర్ అబాట్ నోబ్ వేయడంతో రింకూ సిక్సర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్‌గా మ్యాచ్ పూర్తి చేశాడు. రానున్న ప్రపంచకప్‌లో రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారుతాడని అప్పుడే మాజీలు అంచనాలు కూడా వేస్తున్నాయి. అయితే రింకూ నుంచి తాను నేర్చుకుంటున్నానని హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అన్నాడు.
రింకూ సింగ్ నుంచి టెక్నిక్స్ నేర్చుకుంటున్నానని తిలక్‌వర్మ(Tilak Varma) తెలిపాడు. ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలబడి ఒత్తిడిని అధిగమించి జట్టును ఎలా గెలిపించాలో రింకూసింగ్ చక్కగా చేసి చూపుతున్నాడని తిలక్ అన్నాడు. ఆట ఆఖరి ఓవర్లలో ఎలా ఆడాలో రింకూ నుంచి నేర్చుకుంటున్నాని... జాతీయ జట్టు కోసం నిలకడైన ప్రదర్శనే చేయడమే తన లక్ష్యమని తిలక్ వర్మ తెలిపాడు. రింకూ దగ్గరి నుంచి నేర్చుకున్న మెళకువలు రానున్న మ్యాచ్‌ల్లో ఆచరణలో పెట్టి తీరుతానని తిలక్ తెలిపాడు. తనపై అసలు ఎలాంటి ఒత్తిడి లేదని.. గత మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు ఆడాలనుకున్నాని తిలక్ వెల్లడించాడు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీపై తనకు నమ్మకముందున్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. జాతీయ జట్టుకు ఎంపికైన తొలి టోర్నీలోనే తిలక్ సత్తా చాటాడు.
ఇక విశాఖ(Visakha Patnam) వేదికగా ఆసీస్(Austrrelia) తో జరిగిన తొలి టీ20(t20) మ్యాచ్ లో టీమిండియా(Team India) అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. దీంతో 5 టీ20ల సీరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ శతకంతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ 52 పరుగులతో రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ కు తలో వికెట్ దక్కింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను కెప్టెన్ సూర్యకుమార్ , ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 80 పరుగులతో దూకుడుగా ఆడగా ఇషాన్ కిషన్ 58 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లో 3 వికెట్లు పడి మ్యాచ్ ఉత్కంఠ నెలకొన్నప్పటికీ రింకూ సింగ్ భారత్ కు విజయాన్నందించాడు.