Virat Kohli: నాలుగో స్థానంలో అతడే బెటర్ - టీమిండియాకు డివిలియర్స్ కీలక సూచన
కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో టీమిండియాలో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
Virat Kohli: మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ఆసియా కప్‌తో పాటు అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు సమయం ముంచుకొస్తున్న వేళ టీమిండియా బ్యాటింగ్ కూర్పుపై చర్చోపచర్చలు ఊపందుకున్నాయి. ఓపెనర్ల విషయంలో పూర్తి స్పష్టత ఉన్నా మిడిలార్డర్‌లో అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ రావాలన్నది భారత జట్టుకు సవాల్‌గా మారింది. ఈ స్థానంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ రాణించడం లేదని ఇటీవల భారత జట్టు సారథి రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీని మీద చర్చ ఊపందుకుంది.
తాజాగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ అభిమానులు ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే ఏబీ డివిలియర్స్ కూడా దీనిపై స్పందించాడు. టీమిండియాకు నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని పంపిస్తే చాలా బాగుంటుందని, ఫోర్త్ ప్లేస్‌లో కోహ్లీ జట్టుకు కీలకంగా మారుతాడని డివిలియర్స్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘టీమిండియాలో నాలుగో స్థానంలో ఎవరు రావాలనేదానిపై మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆ స్థానంలో కోహ్లీని పంపిస్తారన్న రూమర్స్ నేను కొన్ని విన్నాను. అదే నిజమైతే అందుకు నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. నాకు తెలిసి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో పర్ఫెక్ట్ ప్లేయర్. నాలుగో స్థానంలో అతడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలడు. మిడిలార్డర్‌లో అతడు చాలా కీలకమవుతాడు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం అతడికి ఇష్టం ఉందో లేదో నాకైతే తెలియదు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడాన్ని బాగా ఆస్వాదిస్తాడు. విరాట్ తన కెరీర్‌లో సాధించిన పరుగులలో ఎక్కువభాగం మూడో స్థానంలో వచ్చి చేసినవే. కానీ ఒక ఆటగాడు తన సూటేబుల్ పొజిషన్ కంటే జట్టు అవసరాల మేరకు నడుచుకోవడం ఉత్తమం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు బాధ్యతలను మోయాల్సి ఉంటుంది.. ’ అని అభిప్రాయపడ్డాడు.
Virat Kohli at No.3 in ODIs:
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2023
Innings - 210.
Runs - 10,777.
Average - 60.21.
Hundreds - 39.
Fifties - 55.
- The greatest No.3 in ODIs is inching towards 11,000 runs! pic.twitter.com/klCNnXYfSi
వాస్తవానికి టీమిండియాలో నాలుగో స్థానంలో ఎవరూ కుదురుగా రాణించడం లేదు. యువరాజ్ సింగ్ తర్వాత వచ్చిన అజింక్యా రహానే ఎక్కువ రోజులు నిలువలేకపోయాడు. కెఎల్ రాహుల్ జట్టు అవసరాల రీత్యా తన స్థానాన్ని పదే పదే మార్చుకున్నాడు. గత కొంతకాలంగా అతడు మిడిలార్డర్‌లో వచ్చి ఫర్వాలేదనిపిస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా నాలుగో స్థానంలో బాగానే రాణించాడు. కానీ రాహుల్, శ్రేయాస్‌లు కొంతకాలంగా గాయాలతో సావాసం చేస్తున్నారు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ ఆడతారా..? లేదా..?అన్నది ఇప్పటికీ అనుమానాస్పదమే. ఇక శ్రేయాస్, రాహుల్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్‌ను పరీక్షించినా అతడు వన్డేలలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని నాలుగో స్థానంలోకి పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది.
వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ఇప్పటిదాకా 42 మ్యాచ్‌లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 55.21 సగటుతో 1,767 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ మూడో స్థానంలో మాత్రం కోహ్లీ ఎవరికీ అందని రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 201 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. ఏకంగా 60.21 సగటుతో 10,777 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు, 55 అర్థ సెంచరీలు ఉండటం విశేషం. గత రెండేండ్లలో శ్రేయాస్ అయ్యర్.. వన్డేలలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 20 ఇన్నింగ్స్‌లలో 47.35 సగటుతో 805 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అయ్యర్.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరి నాలుగో స్థానంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరిని బరిలోకి దింపనుంది..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial