Rajkot T20i Result: సూర్య ఆ ట్రిక్ మిస్సయ్యాడు.. లేకుంటే ఫలితం వేరేలా ఉండేది.. షమీ గాడిన పడతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు
14 నెలల తర్వాత ఈ మ్యాచ్ లో పునరాగమనం చేసిన వెటరన్ పేసర్ మహ్మద్ షమీని సూర్య చక్కగా ఉపయోగించుకోలేక పోయాడని చోప్రా తెలిపాడు. అతడిని ఫుల్ కోటా బౌలింగ్ వేయించినట్లయితే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషించాడు.

Shami Vs Surya: ఇంగ్లాండ్ తో మంగళవారం భారత జట్టు మూడో టీ20లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 26 పరుగుల తేడాతో పరాజయం పాలై, ఇంగ్లాడ్ సిరీస్ లో బోణీ కొట్టేందుకు అవకాశమిచ్చింది. అయితే టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సారథ్య వైఫల్యంతోనే భారత్ ఓడిపోయిందని మాజీ క్రికెటర్ కమ్ కామేంటేటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. 14 నెలల తర్వాత ఈ మ్యాచ్ లో పునరాగమనం చేసిన వెటరన్ పేసర్ మహ్మద్ షమీని చక్కగా ఉపయోగించుకోలేకపోయాడని తెలిపాడు. అతడిని ఫుల్ కోటా బౌలింగ్ వేయించినట్లయితే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషించాడు. మరోవైపు ఒకదశలో ఇంగ్లాండ్ 140 స్కోరు కూడా దాటుతుందా అనిపించింది. ఈ దశలో లియామ్ లివింగ్ స్టన్ సిక్సులతో రెచ్చిపోయాడు. ఇక ఆఖరి వికెట్ కు కీలకమైన 24 పరగులను ఆఖరి వరుస బ్యాటర్లు ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ జత చేశారు. చెరో పది పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ 171/9తో భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఇండియా ఓవర్లన్నీ ఆడి 145/9కే పరిమితమైంది.
అప్పటివరకు ఎందుకని ఆపారు..?
నిజానికి షమీతో నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేయిస్తే బాగుండేదని చోప్రా వ్యాఖ్యానించాడు. ఇలాంటి క్రూషియల్ ట్రిక్ ను సూర్య మిస్సయ్యాడని తెలిపాడు. మ్యాచ్ లో 7 వికెట్లు పడిన వేళ, షమీతో బౌలింగ్ చేయించినట్లయితే ఇంగ్లాండ్ త్వరగా ఆలౌట్ అయ్యుండేదని, దీంతో భారత్ కు టార్గెట్ తక్కువగా సెట్ అయ్యేదని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో షమీ కేవలం మూడు ఓవర్లే బౌలింగ్ చేసి 25 పరుగులు సమర్పించుకున్నాడు. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన అవసరం లేకుండేనని చోప్రా వ్యాఖ్యానించాడు. సూర్య లెక్కల కారణంగా షమీ మూడు ఓవర్లకే పరిమితమయ్యాడని పేర్కొన్నాడు.
గాడిన పడాలి..
14 నెలల విరామం తర్వాత బౌలింగ్ చేసిన షమీని చోప్రా విశ్లేషించాడు. షమీ చివరగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. అప్పటికీ, ఇప్పటికీ తన వేగంలో పది కిమీల వరకు తేడా ఉందని చోప్రా తెలిపాడు. తన రనప్ కూడా నెమ్మదిగా సాగిందని, అందుకే వేగం తగ్గిందని వ్యాఖ్యానించాడు. సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా షమీ ఉన్నాడని, పుంజుకోడానికి కాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. తర్వాత మ్యాచ్ కల్లా షమీ తన మునుపటి వాడిని చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో కాస్త మంచి లైన్ అండ్ లెంగ్త్ తోనే షమీ బౌలింగ్ చేశాడు. అయినా లక్కు కలిసి రాక వికెట్లు రాలేదు. ఇక షమీ పునరాగమనం కోసం మరో పేసర్ అర్షదీప్ సింగ్ కు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో ప్రస్తుతం 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. తర్వాతి మ్యాచ్ ఈనెల 31న శుక్రవారం పుణేలో జరుగుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

