India vs Pakistan Final: 18 ఏళ్లుగా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించని భారత్.. నేటి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా?
Asia Cup 2025 Final | భారత్, పాక్ ఆసియా కప్ 2025 ఫైనల్లో తలపడుతున్నాయి. కానీ గత 18 ఏళ్లలో ఫైనల్లో పాక్ మీద భారత్ విజయం సాధించలేదు. చివరగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడింది.

India vs Pakistan Aisa Cup Final: దుబాయ్: ఆసియా కప్ 2025లో భారత్ చేతిలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ, పాకిస్తాన్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆదివారం, సెప్టెంబర్ 28న, 2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ ఒక T20 టోర్నమెంట్‌లో రెండవసారి ఫైనల్‌లో తలపడనున్నాయి. అలాగే, ఇరు దేశాల మధ్య మొత్తం 10 ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు దాయాదుల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలు ఏమిటో ఇక్కడ మీకు అందిస్తున్నాం.
భారత్, పాకిస్తాన్ మధ్య 11వ సారి ఫైనల్ మ్యాచ్ నేడు రాత్రి 8 గంటలకు దుబాయ్ లో జరగనుంది. ఇందులో ట్రై సిరీస్ లేదా ఏదైనా టోర్నమెంట్ మాత్రమే ఉన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌ను ఇందులో చేర్చలేదు. ఇండియా 18 సంవత్సరాలుగా పాకిస్తాన్‌పై ఎలాంటి ఫైనల్ మ్యాచ్ గెలవలేదు. చివరిసారిగా భారత్ 2007 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోనీ కెప్టెన్సీలో పాకిస్తాన్‌ను ఓడించింది.
ఆసియా కప్‌లో 41 ఏళ్ల తరువాత తొలిసారి ఫైనల్
ఆసియా కప్ తొలి టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. 1984లో భారత్ ప్రత్యర్థి పాక్ మీద 54 పరుగుల తేడాతో గెలుపొందింది. తరువాత భారత్-పాక్ మధ్య ఎలాంటి టైటిల్ మ్యాచ్ జరగలేదు. ఇండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. పాకిస్తాన్ కేవలం 2సార్లు మాత్రమే విజేతగా నిలిచింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఆడిన 10 ఫైనల్ మ్యాచ్‌లు
1- మార్చి 10, 1985న ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది
2- ఏప్రిల్ 18, 1986న ఆస్ట్రల్-ఏషియా కప్‌లో పాకిస్తాన్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది
3- అక్టోబర్ 25, 1991న విల్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది
4- ఏప్రిల్ 22, 1994న ఆస్ట్రల్-ఏషియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది
5- 1998లో ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది
6- ఏప్రిల్ 4, 1999న పెప్సీ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది
7- ఏప్రిల్ 16, 1999న కోకా-కోలా కప్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది, ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది
8- సెప్టెంబర్ 24, 2007న టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది
9- జూన్ 14, 2008న కిట్‌ప్లై కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది
10- జూన్ 18, 2017న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది
2017 ఫైనల్ కు ప్రతీకారం తీసుకునే అవకాశం!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. టీమిండియా ఈ కీలక మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించకపోయినా, ఫ్యాన్స్ మాత్రం 2017లో ఓటమిని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ భారత్‌ను 180 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకునే సరైన అవకాశం ఇదే అని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్ ప్రత్యేకత ఏమిటంటే 2017 తర్వాత భారత్-పాకిస్తాన్ మళ్లీ ఓ ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి. ఈసారి పాక్‌ను ఓడించి 8 ఏళ్ల క్రితం జరిగిన ఓటమికి బదులివ్వాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన 5 ఐసీసీ ఫైనల్స్‌లో పాకిస్తాన్ 3 విజయాలు, భారత్ 2 విజయాలు సాధించాయి. చివరిసారి ఈ జట్లు ఫైనల్లో తలపడినప్పుడు పాక్ పైచేయి సాధించింది.





















