BWF World Championships 2022: గుంటూరు మిర్చీ ఘాటు తగిలేది ఎవరికి? సైనా తొలి ప్రత్యర్థి ఎవరు?
BWF World Championships 2022: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు టీమ్‌ఇండియా రెడీ!ఇప్పటికే నిర్వాహకులు డ్రా తీశారు. మరి తొలి రౌండ్లో ఎవరు ఎవరితో తలపడుతున్నారంటే?
BWF World Championships 2022 Draw: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు టీమ్‌ఇండియా రెడీ! 27 మందితో కూడిన భారత బృందం ఈ మెగా టోర్నీలో పాల్గొంటోంది. ఏడుగురు షట్లర్లు సింగిల్స్‌లో తలపడుతున్నారు. పది జంటలు డబుల్స్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు డ్రా తీశారు. మరి తొలి రౌండ్లో ఎవరు ఎవరితో తలపడుతున్నారు? ప్రత్యర్థి బలాబలాలేంటో మీ కోసం!
పురుషుల సింగిల్స్‌లో నలుగురు
ఈ విభాగంలో నలుగురు షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. గతేడాది రజతం, కాంస్యం గెలిచిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌తో టాప్ 15లో ఉన్నారు. వీరితో పాటు హెచ్ ఎస్ ప్రణయ్, బీ సాయి ప్రణీత్ ఆశలు రేపుతున్నారు. తొలి రౌండ్లో సాయికి కఠిన డ్రా ఎదురైంది. చైనీస్ తైపీ షట్లర్, నాలుగో సీడ్ చౌ టీన్ చెన్‌తో తలపడుతున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌కు సులభ డ్రానే పడింది. వియత్నాం షట్లర్ నాట్ ఎంగుయెన్‌ను ఎదుర్కోనున్నాడు. తొమ్మిదో సీడ్‌గా దిగుతున్న లక్ష్య సేన్ ప్రపంచ 14వ ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు హాన్స్ క్రిస్టియన్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ వియన్నా ఆటగాడు లూకా వ్రాబర్‌తో ఆడనున్నాడు. ఒకవేళ అతడు వరుసగా రెండు రౌండ్లు గెలిస్తే లక్ష్యసేన్‌తో ప్రి క్వార్టర్స్ ఆడాల్సి వస్తుందని అంచనా.
సైనాపై ఆశలు
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు నేరుగా రెండో రౌండుకు అర్హత సాధించింది. అయితే కాలి మడమ గాయంతో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక మాళవికా బాన్సోడ్ తొలి రౌండ్లో డెన్మార్క్ షట్లర్ లైన్ క్రిస్టోఫర్‌సెన్‌తో తలపడాల్సి ఉంది. చాన్నాళ్ల తర్వాత బరిలోకి దిగుతున్న సైనా నెహ్వాల్ హాంకాంగ్ అమ్మాయి చెంగ్ ఎంగన్ యిని ఎదుర్కోనుంది. భారత పతక ఆశలు ఆమె మీదే ఉన్నాయి.
సాత్విక్, చిరాగ్ ఏం చేస్తారో?
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మను అత్రి, సుమీత్ రెడ్డీ ద్వయం జపాన్‌కు చెందిన హిరోకీ ఒకమురా, మసయూకీ ఒండెరా జోడీని ఢీకొట్టనుంది. ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల జంట డెన్మార్క్ ద్వయం సుపక్ జొమ్‌కో, కిట్టినుపంగ్ కెడ్రెన్‌తో తలపడాల్సి ఉంటుంది. పటిష్ఠమైన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయానికి తొలి రౌండ్లో బై లభించింది. కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జోడీ ఫ్రాన్స్‌కు చెందిన ఫాబియెన్, విలియంను ఎదుర్కోనున్నారు.
ఎక్కువ జోడీలు ఇక్కడే
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, ఎన్.సిక్కి రెడ్డి జోడీ అమినాత్ నబీహా, ఫతీమాత్ నబాహా (మాల్దీవులు)తో తలపడనుంది. ఇక పూజా దండు, సంజనా సంతోష్ ద్వయం ఐనెస్ లూసియా, పౌలా లా టొర్రె (పెరూ)ను ఎదుర్కోనుంది. ట్రీసా జోలీ, పుల్లెల గాయత్రీ సంయుక్తంగా ఇండోనేసియాకు చెందిన లా యీన్ యువాన్, వలెరీ జంటతో పోరాడనుంది. అశ్వినీ భట్, శిఖా గౌతమ్ జోడీ మార్టినా కోర్సిని, జుడిత్ మైయిర్‌తో తలపడాల్సి ఉంది.
మిక్స్‌డ్‌లో పోరాటమే
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఇషాన్ భట్నాగర్, తనీషా జోడీ జర్మనీకి చెందిన ప్యాట్రిక్ షెయిల్, ఫ్రాన్సిస్కా వొల్క్‌మన్‌తో తలపడనున్నారు. ఇక వెంకట్ గౌరవ్ ప్రసాద్, జుహీ దివాంగన్ ద్వయం ఇంగ్లాండ్ జోడీ జార్జొరి మెయిర్స్, జెన్సీ మూరేను ఎదుర్కొనుంది.