Olympic Games Update: 2032లో ఒలింపిక్స్ ఎక్కడో తెలుసా? ఆస్ట్రేలియాకు ఎన్ని ఓట్లు వచ్చాయి?
2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది.
2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 35వ ప్రపంచ క్రీడా సంబరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న దేశంగా నిలుస్తుంది.
సిడ్నీలో 2000లో ఒలింపిక్స్ జరగ్గా.. అంతకముందు 1956లో మెల్‌బోర్న్ వేదికగానూ ఈ అంతర్జాతీయ క్రీడలు జరిగాయి. 2032 ఒలింపిక్స్ అనంతరం పారాలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి. బ్రిస్బేన్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహణపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 80 ఓటింగ్ కార్డులను పంపిణీ చేయగా.. 77 ఓట్లు చెల్లాయి. 72 ఓట్లు అనుకూలంగా రాగా.. వ్యతిరేకంగా 5 ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఐఓసీ మీడియా ట్విటర్‌లో పేర్కొంది.
తమ దేశంలో క్రీడలను విజయవంతం చేసేందుకు ఏమేం అవసరమో తెలుసని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ అన్నారు. ఇది బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌కే కాదు.. యావత్ దేశానికే చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఐఓసీ ఓటింగ్ సెషన్‌లో తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా సంబరానికి 2024లో ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుండగా.. 2028లో లాస్ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్ జరగనున్నట్టు ఐఓసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ సందడి ఇప్పటికే మొదలైంది.
బ్రిస్బేన్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో మైదానాలు సిద్ధం చేస్తోంది. గతంలో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన గోల్డ్ కోస్ట్‌లో కూడా కొన్ని క్రీడలు నిర్వహిస్తారు. ఆసీస్ కరెన్సీలో 5 బిలియన్ డాలర్లు ఒలింపిక్స్ కోసం ఖర్చవుతోందని ప్రాథమిక అంచనా. గబ్బా స్టేడియంలో ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పారా ఒలింపిక్స్ నిర్వహిస్తారు. గత ఏడాది జరగాల్సిన ఈ విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. అన్ని అవాంతరాలను అధిగమించి టోక్యో క్రీడలను నిర్వహిస్తోంది. క్రీడలు చూసేందుకు ప్రేక్షకులకు ఎలాంటి అనుమతి లేదు. ప్రారంభ వేడుకకు రెండు రోజుల ముందే క్రీడలు మొదలయ్యాయి. బుధవారం జపాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ తో అధికారికంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకకు ముందు క్రీడలు ప్రారంభమవ్వడం మామూలే.
క్రీడా గ్రామంలో ఇప్పటికీ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిజల్ట్ వస్తోంది. దీంతో కొందరు క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. దిగ్గజ ఆటగాళ్లు కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కి దూరమయ్యారు. టోక్యో ఒలింపిక్స్ పై ఓ సర్వే నిర్వహించగా... అంతగా ఆసక్తి లేదని అభిమానులు తెలిపినట్లు సర్వే వెల్లడించింది.