Lord Ganesh: మీరు గణపతి భక్తులా - బుధవారం ఉపవాసం చేసే విధానం, విశిష్టత, జపించాల్సిన మంత్రం ఇదే
Wednesday Special: బుధవారం గణపతిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల కుండలిలోని బుధ దోషం తొలగిపోయి వినాయకుని అనుగ్రహం లభిస్తుంది. బుధవారం ఉపవాసం ఎలా చేయాలి.. ఈ రోజు ఏ మంత్రాన్ని జపించాలి?
Wednesday Special: హిందూమతంలో, బుధవారాన్ని గణపతికి అంకితం చేశారు. ఎవరైతే ఈ రోజు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారో, ఉపవాసం ఉంటారో అలాంటి వారి జీవితంలోని అన్ని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఉపవాసం మనిషి జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. బుధవారం పూజ, ఉపవాసం ఒక వ్యక్తి జాతకంలో బుధుడిని బలపరుస్తుంది.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం, బుధవారం ఉపవాసం ఏ నెలలోనైనా శుక్ల పక్ష బుధవారం నుంచి ప్రారంభించవచ్చు. అయితే, ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన సమయం విశాఖ నక్షత్రం ఉండే బుధవారంగా పరిగణిస్తారు. ఈ వ్రతం 7 లేదా 21 బుధవారాలు క్రమం తప్పకుండా తప్పనిసరిగా పాటించాలి. ఉపవాసం చివరి రోజున నియమానుసారంగా ఉద్యాపన నిర్వహించాలి. కానీ, ఈ వ్రతం పితృపక్షంలో ప్రారంభించకూడదని గుర్తుంచుకోండి. బుధవారం ఉపవాసం చేసే విధానం, మంత్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
బుధవారం పూజా విధానం
- బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ముందుగా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి.
- తర్వాత స్నానం చేసి ఆకుపచ్చని దుస్తులు ధరించాలి.
- దీని తర్వాత గణపతిని పూజించండి.
- గణేశుడికి ధూపం, దీపం, కర్పూరం, చందనం, పుష్పాలు సమర్పించండి.
- గణేశుడికి దూర్వాయుగ్మం సమర్పించడం మర్చిపోవద్దు.
- గణపతి మంత్రాలను పఠించండి.
- వినాయకుడికి హారతి ఇవ్వండి.
- బుధవారం ఉపవాసం కథను చదవడం మర్చిపోవద్దు.
- చివర్లో వినాయకుడికి ఉండ్రాళ్లు సమర్పించండి.
బుధవారం పూజ ప్రాముఖ్యత
బుధవారం ఉపవాసం ఉండటం ద్వారా అన్ని పనులు సజావుగా పూర్తవుతాయని నమ్ముతారు. ఈ ఉపవాసం పుణ్య ప్రభావం కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. అదే సమయంలో, మెదడు చైతన్యవంతమవుతుంది. 7 బుధవారాలు నిరంతర వ్రతం చేసి, నియమానుసారంగా గణపతిని పూజించిన వారి ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని చెబుతారు.
బుధవారం ఉపవాస నియమం
- ఉపవాసం రోజున, ఉదయాన్నే లేవాలి.
- బుధవారం ఉపవాస కథ వింటున్నప్పుడు మధ్యలో కూర్చున్న భంగిమను మార్చకూడదు.
- ఈ ఉపవాస సమయంలో, రోజంతా పండ్లు తినండి. సాయంత్రం పూజ తర్వాత భోజనం చేయండి.
- పెసలు, పెరుగు లేదా పచ్చి పదార్థాలతో చేసిన ఆహారాన్ని బుధవారం ఉపవాసం ఆచరించేవారు తినవచ్చు.
- ఈ రోజున పేదవారికి ఆకుపచ్చ రంగు దుస్తులు, పువ్వులు మరియు కూరగాయలను దానం చేయండి.
బుధవారం పూజ మంత్రం
బుధవారం నాడు ఈ గణేశ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలని గుర్తుంచుకోండి.
'ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో బుద్ధి ప్రచోదయాత్.'
Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?
వీటిని బుధవారం వినాయకునికి సమర్పించండి
- బుధవారాలు గణేశుడిని పూజించేటప్పుడు, ఎర్రటి కెంపు రంగులోని తిలకం ఆయనకు బొట్టు పెట్టాలి.
- గణపతికి ప్రీతిపాత్రమైన గరికను తప్పకుండా వినాయకుడికి సమర్పించాలి.
- శమీ పత్రంతో పాటు గరికతో గణపతిని పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
- మీరు అన్నం వండి గణపతికి మహా నివేదనగా సమర్పించవచ్చు.
- ఈ రోజు వినాయకుడికి నెయ్యి, బెల్లం సమర్పించాలి.
Also Read : తాంత్రికులకు నచ్చే గణపయ్య, ఈయన వాహనం ఎలుక కాదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.