Vasudeva Dwadashi 2023: జూన్ 30 'వాసుదేవ ద్వాదశి', తొలి ఏకాదశి మర్నాడు వచ్చే ఈ రోజు ప్రత్యేకత ఇదే!
ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశి మర్నాడు వచ్చే ద్వాదశిని వాసుదేవ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి ప్రత్యేకత ఏంటంటే..
Vasudeva Dwadashi 2023: వాసుదేవ ద్వాదశి రోజు కృష్ణుడికి సంబంధించినది. దీనిని తొలి ఏకాదశి తర్వాత రోజు జరుపుకోవాలి. చాతుర్మాస్య వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని కొన్ని పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతం మొదలుపెట్టక పోవటంతో, ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు(వాసుదేవుడు) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని పురాణ కథనం.
Also Read: దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
వాసుదేవుడు అని ఎందుకంటారు
వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. శ్రీ మహా విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ప్రత్యేకత ఉంది.
వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నిటిలో వసించు వాడు కనుక వాసుదేవుడు అని అంటారు. విష్ణు సహస్రనామంలో
‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’
అనేది దీనినే సూచిస్తోంది. ఇక అన్ని ప్రాణుల్లో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు. ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది
‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:
అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే...
‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’
అంటే అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని విష్ణు సహస్ర నామంలో వివరించాడు
వాసుదేవ ద్వాదశి రోజు ఏం చేయాలి
ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానకి వస్తే శయనేకాదశి రోజు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున శ్రీ మహా విష్ణువుని పూజించి భోజనం చేస్తారు. ద్వాదశి పుణ్య తిథి, శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైనది, శయన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యత ఎక్కువ. వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాల్లో ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాలను అనుసరించాలి. వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్ర నామం పఠించటం, గోపద్మ వ్రత కథను చదవటం శ్రేయస్కరం.
Also Read: సింహరాశిలో కుజుడి సంచారం ఈ రాశులవారికి అంతా శుభమే
కృష్ణాష్టకమ్
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ‖
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ‖
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.