Vastu: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
దేవాలయాల సమీపంలో , ముందు వెనుక, చుట్టుపక్కల ఇళ్ళు ఉండకూడదని అంతా అనుకుంటారు. కారణాలు తెలియక పోయినా పెద్దలు చెప్పారు ఫాలో అయిపోదాం అంటారు. ఇంతకీ నివాసస్థలాలు ఆలయానికి ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు
దేవాలయం పవిత్రమైన స్థలం. ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మరచిపోయి ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు భక్తులు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఓ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందుకే ఆలయం లోపల మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల కూడా అంతా పవిత్రంగా ఉండాలంటారు. పైగా ఆలయం నుంచి వచ్చే శక్తి తరంగాలు ఇళ్లపై పడితే ఆ శక్తిని తట్టుకునే వాతావరణం ఆ ఇంటికి ఉండకపోవచ్చు. అందుకే ఆలయాలకు సమీపంలో ఇళ్లు ఉండకూడదని చెబుతారు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే గుడి నీడ ఇంటిపై పడకూడదు అని ఇందుకే ఇంటారు. అయితే ఆలయాల సమీపంలో నివాస స్థలాలు ఉండకూడదని కాదు. వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించక తప్పదంటారు వాస్తు నిపుణులు.
- ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు. ఆ ఇంట్లో నిత్యం ఏదో విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది.
- ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి
- వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండొచ్చు
- శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు
- అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరు
- విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్రరం, వాయువ్యం వైపు ఉంటే వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
- ఏ ఆలయానికి అయినా కనీసం 100 అడుగుల దూరం తప్పనిసరి
- ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి.
- పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల సమీపంలో ఉంటే మధ్యమం. గ్రామం, నగరాల మధ్యలో ఆలయం నిర్మిస్తే అధమం అని మహర్షులు శ్లోకం రూపంలో చెప్పారు.
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
ఆలయాల సమీపంలో ఉన్నవారంతా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు డైరెక్షన్ ఎటువైపు ఉందో చూసుకోండి. ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచీ ఎలా ఉన్నారో గమనించండి...అవసరం అయితే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకుంటే సరిపోతుందంటారు వాస్తు నిపుణులు.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్లో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కానీ ఇళ్లలో అలాకాదు.. అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరుగుతాయి, ఆడపిల్లలకు నెలా నెలా ఇబ్బందులుంటాయి. ఆ ప్రభావం గుడికొచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చంటారు మరికొందరు పండితులు.
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది
Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.