Vastu Tips: రోజూ సాయంత్రం సమయంలో ఇల్లు ఊడ్చొచ్చా.. వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది!
Vastu Tips In Telugu: సాయంత్రం పూట ఇల్లు ఊడ్చొచ్చా? ఆ చెత్తను బయట వేయాలా - ఇంట్లనే ఉంచాలా? వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు?

Vastu Tips: లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలనే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా నియమాలున్నాయి. అన్నీ చిన్న చిన్న నిమమాలే కానీ పాటిస్తే దీర్ఘకాలిన ప్రయోజనాలు పొందుతారు. ఇలాంటి నియమాల్లో ఒకటి సాయంత్రం సమయంలో ఇల్లు ఊడ్చటం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లు ఊడ్చి వాకిట్లో ముగ్గువేసి, స్నానం ఆచరించి దేవుడికి పూజ చేస్తారు. అలానే చాలామందికి సాయంత్రం సమయంలోనూ ఇల్లు ఊడ్చే అలవాటు ఉంటుంది. కొందరు సంధ్యా దీపం అని సాయంత్రం సమయంలో ఇల్లు ఊడ్చి లైట్లు వేసిన వెంటనే దీపం వెలిగిస్తారు. భగవంతుడి సన్నిధిలో దీపం వెలిగించేవారు కొందరైతే..ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారు.
ఇంతకీ సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చవచ్చా?
ఊడిస్తే ఆ చెత్తను బయట వేయవచ్చా?
చీకటి పడిన తర్వాత ఆ చెత్తను బయట వేస్తే ఏమవుతుంది?
వాస్తు శాస్త్రం ప్రకారం చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చి చెత్తను బయట వేస్తే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చెబుతారు. అందుకే సూర్యాస్తయమం లోగా ఇల్లు ఉడ్చేయాలి. అప్పుడు కూడా ఆ చెత్తను బయట పడేయకూడదు..ఓ కవర్లోనో, డస్టబిన్ లోనే వేసి ఉంచేయాలి.
వాస్తు అనేది ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని అనుసరించడం వల్ల అయితే లాభం జరుగుతుంది లేదంటే ప్రశాంతత లభిస్తుంది కానీ నష్టం జరగదని సూచిస్తారు పండితులు. అందుకే ఇల్లు, కార్యాలయం, దుకాణం, హోటల్ ఇలా ఏం నిర్మించినా కానీ వాస్తు శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తు శాస్త్ర చిట్కాలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కడున్నా కానీ సూర్యాస్తయమం సమయంలో ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయటకు వేస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుందని నమ్ముతారు. అదే సమయంలో ఇంటి ముందు గందరగోళంగా చేయడం, బురద చల్లడం లాంటివి చేయకూడదు. ఇంటి ముందు కడిగి ముగ్గు వేస్తే శుభమే జరుగుతుంది. అందుకే సాయంత్రం ఇంట్లో పోగేసిన చెత్తను ఓ సంచిలో ఉంచి మర్నాడు సూర్యోదయం తర్వాత బయటపడేయండి.
అదే సమయంలో ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురు బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. ఇంటికి వచ్చిన వారికి కనిపించేలా ఎదురుగా పెట్టకూడదు. బహిరంగ ప్రదేశంలో కనిపించే చీపురు ఇంట్లో దుష్ట శక్తులను ఆహ్వానిస్తుందని, పేదరికం పెరుగుతుందని చెబుతారు. డైనింగ్ హాల్లో, హాల్లో, స్టడీ రూమ్, బెడ్ రూమ్ లో చీపురు ఉంచకూడదు. చాలామందికి మంచం కింద పెట్టే అలవాటు ఉంటుంది..అసలు చీపురే కాదు, మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు. ఇంటి బయట కప్పుపై కూడా చీపురు పెట్టకూడదు. వంటగదిలో, ఈశాన్యం మూలన చీపురు అస్సలు ఉంచకుకూడదు. బాల్కనీల్లో, ఇంటి బయట ఓ మూలగా ఎవరకీ కనిపించకుండా చీపురు పెట్టాలి. చీపురును ఎప్పుడూ నేలపైనే ఉంచాలి..అది కూడా తుడిచినప్పుడు ఎలా పట్టుకుంటామో అలానే ఉంచాలి. విరిగిన, పాడైన చీపుర్లు వినియోగించడం దుష్టశక్తులకు ఆహ్వానం పలకడమే.
గమనిక: వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినవి, కొన్ని వాస్తు గ్రంధాల్లో సూచించిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఎందుకంటే ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. వీటి గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన వాస్తుపండితుల సంప్రదించగలరు.






















