Vastu Tips In Telugu: ఆలయాల నీడ ఇళ్లపై పడితే ఏమవుతుంది!
Vastu Tips In Telugu: దేవాలయాల సమీపంలో , ముందు వెనుక, చుట్టుపక్కల ఇళ్ళు ఉండకూడదా? ఆలయాల నీడ ఇంటిపై పడకూడదా? పడితే ఏమవుతుంది? వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు?
Vastu Tips In Telugu: దేవాలయం అంటేనే పవిత్రమైన స్థలం. దేవుడి సన్నిధిలో అడుగుపెట్టగానే ఓ తన్మయత్వానికి లోనవుతారు భక్తులు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఓ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. నిత్యం పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుండడంతో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అందుకే ఆలయంలో అడుగుపెట్టేవారు పవిత్రంగా ఉండాలని సూచిస్తారు. మరి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్నవారందరకీ మంచి జరగాలి కదా? మరి ఆలయాల సమీపంలో ఇళ్లు ఉండకూడదని ఎందుకంటారు? ఆలయాల నీడ పడితే మంచిది కాదని చెబుతారెందుకు? ఇందులో నిజమెంత? వాస్తు శాస్త్ర పండితులు ఏమంటున్నారు?
Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!
ఆలయానికి 200 అడుగుల దూరంలో...
ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు. ఆ ఇంట్లో నిత్యం ఏదో విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి
ఆలయానికో నియమం
వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు ఇళ్లు వెనుకవైపు..శ్రీ మహావిష్ణువు ఆలయాలకు ముందువైపు ఇళ్లు ఉండొచ్చు. శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదంటారు. ఇక అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరు. విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్తరం( North), వాయువ్యం వైపు ఉంటే ఈ ఇంట్లో ఉండేవారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
ధ్వజస్తంభం నీడ పడకూడదు
ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి.
ఇప్పటికే ఆలయాల సమీపంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి?
ఆలయాల సమీపంలో ఉన్నవారంతా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు డైరెక్షన్ ఎటువైపు ఉందో చూసుకోండి. ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచీ ఎలా ఉన్నారో గమనించండి...అవసరం అయితే నిపుణులైన వాస్తు నిపుణులను పిలిచి చూపించి..వారి సూచనల మేరకు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకుంటే సరిపోతుంది.
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
మరో వాదన ఇదే!
ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్లో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కానీ ఇళ్లలో అలాకాదు.. అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరుగుతాయి, ఆడపిల్లలకు నెలా నెలా ఇబ్బందులుంటాయి. ఆ ప్రభావం గుడికొచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చంటారు మరికొందరు పండితులు.
Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!
Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.