శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయాలి. స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు కలగడానికి ఇది ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రత కథ: షోడసోపచార పూజ పూర్తిచేసి ఈ కథ చదువుకుని వాయనం ఇవ్వాలి!
Varalakshmi Vratam Story Telugu: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేవారు పూజలో భాగంగా చదువుకోవాల్సిన కథ ఇదే..

- పరమేశ్వరుడు పార్వతికి వరలక్ష్మీ వ్రత కథ వివరించాడు.
- చారుమతి కలలో వరలక్ష్మి కనిపించి వ్రతం చేయమంది.
- భక్తితో వ్రతం చేయగా స్త్రీలకు అష్టైశ్వర్యాలు కలిగాయి.
- ప్రతి సంవత్సరం వ్రతం ఆచరించి సుఖ సంతోషాలు పొందారు.
Varalakshmi Vratha Katha in Telugu: వరలక్ష్మీ వ్రత కథ
సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులతో ఇలా చెప్పారు. మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించే వ్రతం గురంచి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు..ఆ వ్రత వివరాలు మీకు చెబుతాను వినండి. కైలాస పర్వతంపై వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంపై పరమేశ్వరుడు కూర్చుండగా పార్వతీదేవి నమస్కరించి.. దేవా!లోకంలో స్త్రీలు ఏ వ్రతం ఆచరిస్తే సౌర్య సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతాన్ని ఆనతీయమని అడిగెను. ఓ మనోహరి..స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలిగించే వరలక్ష్మీ ప్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేయాలని చెప్పి.. ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో కూడా శివుడు వివరించాడు.
మగధ దేశంలో కుండినంబనే పట్టణం ఉంది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలు, బంగారు గోడలున్న ఇండ్లతో ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ నివశించెను. భర్తను దేవుడితో సమానంగా తలచి ప్రచి రోజూ భర్తకు , అత్తమామలకు పూజలు చేసి ఇంటి పనులు చేసుకుని మంచి మాటలు మాత్రమే మాట్లాడేది. ఆ మహాపతివ్రతను అనుగ్రహించిన వరలక్ష్మీదేవి కలలో కనిపించి.. ఓ చారుమతీ నేను వరలక్ష్మీదేవిని ..నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను...శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించిన నీవు కోరిన వరాలు ఇస్తానని చారుమతీ దేవి కలలో చెప్పెను. ఆ కలలోనే చారుమతీ దేవి.. వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి
‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!!
అని స్తుతించెను. తెల్లవారిన తర్వాత తన కల గురించి భర్త, అత్తమామలతో చెప్పి వ్రతం ఆచరిస్తానని చెప్పెను. చారుమతి కల గురించి విన్న ఇరుగు పొరుగు స్త్రీలు కూడా శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. శ్రావణ శుక్రవారం రోజు వేకువజామునే నిద్రలేచి స్నానమాచరించి..శుచియైన వస్త్రాలు కట్టుకుని చారుమతీ దేవి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చారుమతీ దేవి ఇంటిని శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గువేసి ఆసనం ఏర్పరిచి కొత్త వస్త్రం పరిచి, కొత్త బియ్యం పోసి, మర్రి చిగుళ్లు సహా పంచ పల్లవములతో కలశం ఏర్పరిచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి భక్తిశ్రద్ధలతో పూజించెను. సాయంకాలం కూడా స్త్రీలంతా కలసి
“పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!
అని ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రాలుగల తోరణాన్ని కుడిచేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదించి ప్రదక్షిణలు చేశారు. ఓ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి కాళ్లకు గజ్జెలు, రెండో ప్రదక్షిణ పూర్తిచేసేసరికి నవరత్న ఖచితంబులైన ఆభరణాలు, మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వరలక్ష్మీపూజ చేసిన స్త్రీలంతా సర్వాభరణాలతో మెరిసిపోయారు.అలా ఆ స్త్రీలంతా వారి వారి ఇంటికి చేరుకుని చారుమతిదేవి గురించి, వరలక్ష్మీ వ్రతం గురించి కథలుగా చెప్పుకున్నారు. వారు కూడా ఇంట్లో వరలక్ష్మీవ్రతం ఆచరించి.. దక్షిణ తాంబూలాలు, వాయనాలు సమర్పించి వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందారు. అప్పటి నుంచి ఏటా వరలక్ష్మీ వ్రతం ఆచిరిస్తూ పుత్రపౌత్రాభివృద్ధి, ధనకనక వస్తు వాహనాలతో సుఖంగా ఉండెను...
ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతం వివాహం అయిన ఏ స్త్రీ అయినా చేయొచ్చని చెప్పెను పరమేశ్వరుడు. ఈ కథను వినేవారికి, చదివేవారికి, వరలక్ష్మీదేవి ప్రసాదం స్వీకరించేవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి.
కథ పూర్తైన తర్వాత వాయన దానం ఇచ్చేటప్పుడు చదవాల్సిన మంత్రం
శ్లోకం
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!
శ్లోకం
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
Frequently Asked Questions
వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ఆచరించాలి?
వరలక్ష్మీ వ్రత కథను మొదట ఎవరు వివరించారు?
పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించారు. ఈ కథను సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్పారు.
వరలక్ష్మీ వ్రతాన్ని మొదట ఎవరు ఆచరించారు?
మగధ దేశంలో కుండినం అనే పట్టణంలో నివసించే చారుమతి అనే స్త్రీ ఈ వ్రతాన్ని మొదట ఆచరించింది. వరలక్ష్మీదేవి కలలో కనిపించి చేయమని చెప్పింది.
వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ వ్రతం ఆచరించిన స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, ధనకనక వస్తు వాహనాలు లభిస్తాయి. కథ విన్నా, చదివినా, ప్రసాదం స్వీకరించినా సకల కార్యాలు సిద్ధిస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















